ప్రకృతి విపత్తుల పాపం ఎవరిది : మోతె రవికాంత్

సరిగ్గా పదేండ్ల క్రితం 2013, జూన్, జులై నెలల్లో ఉత్తర భారతదేశం వరదలతో విలవిల్లాడిపోయింది. ఉత్తరాఖండ్ అనూహ్య వరదలతో అతలాకుతలమైంది. అలాంటి ప్రకృతి విలయాన్ని పూర్తిగా మరిచిపోక ముందే మళ్లీ ఉత్తరాదిని వరదలు మంచెత్తుతున్నాయి. హిమాచల్​ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగుతోంది. 

వరదలకు కారణం ఏమిటి?

ఈ ప్రకృతి విలయాలకు కారణం ఎవరు? గత ప్రమాదాల నుంచి ప్రజలు, ప్రభుత్వాలు ఏం నేర్చుకున్నాయి? ప్రభుత్వాలు ఏం చర్యలు చేపట్టాయి? ఎందుకు ఉత్తర భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ దుస్థితికి వాతావరణ మార్పులు ఎంత కారణమో? ప్రభుత్వాలు, ప్రజల బాధ్యతారాహిత్యం కూడా అంతే కారణం. 2013 ఉత్తరాఖండ్ వరదల విషయం తీసుకుంటే నాలుగు దశాబ్దాలుగా అక్కడ పర్యాటకం విపరీతంగా పెరిగింది. యాల అభివృద్ధి అనివార్యమైయింది. అయితే పర్యావరణ పరిమితులు దాటి కేవలం అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు, ప్రాజెక్టులు చేపట్టడంతో ప్రకృతి విలయతాండవం చూపిస్తున్నది. ఉత్తరాఖండ్​లో పర్యాటకం పేరుతో ఎగువన హిమాలయ పర్వత సానువులు, మందాకినీ నది పరిసర ప్రాంతాల్లో దాదాపు 70 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు నిర్మించారు. ఇలాంటి పెద్దపెద్ద ప్రాజెక్టులు ఇష్టానుసారం నిర్మించడం వల్ల, అక్కడ వివపరీతంగా కురిసిన వర్షాలకు హిమాలయాల్లో 3800 మీటర్ల పైన ఉన్న చోరాబరి గ్లేసియర్ కదలడం వల్ల, వర్షాలకు తోడు మంచు ఫలకాలు కూడా కదిలి మందాకిని నదికి అనూహ్య వరదలు ముంచెత్తాయి. ఇలాంటి పరిణామాల వల్లే ఉత్తరాఖండ్​లోని జోషిమఠ్ పట్టణం కుంగిపోవడం మనకు తెలిసిన విషయమే. 

ఇప్పుడు మళ్లీ వరదలు..

గతంలో లాగే సరిగ్గా పదేండ్ల తరువాత 2023లో మళ్లీ తీవ్రమైన వర్షాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. ఈసారి వర్షాలు, వరదలకు హర్యానా, పంజాబ్, హిమాచల్​ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలు బలైతున్నాయి. గత 10 రోజుల నుంచి మొదలైన వర్షాలు తీవ్రరూపం దాల్చి ఆయా రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాలు గతి తప్పడం, వాతావరణ మార్పులు, ఎల్​నినోలో ప్రభావం వంటి కారణాల వల్ల తీవ్రమైన వర్షాలు ఈ ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. రుతు పవనాలు మొదలయ్యాక దేశంలో సాధారణ వర్షపాతం కంటే కొన్ని ప్రాంతాల్లో 2 శాతం అధిక వర్షపాతం నమోదైట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక ఉత్తరవాయువ్య రాష్ట్రాల్లో 59% అధికంగా, ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో 23% అధిక వర్షపాతం నమో దవుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా వరదలు ముంచెతుత్తాయి. దేశ రాజధాని ఢిల్లీ విషయమే తీసుకుంటూ గత రెండుమూడు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువన హర్యానాలో హత్నికుంద్ బ్యారేజీ నుంచి వరద నీటిని విడుదల చేయడంతో యమునా నదికి వరద ఉధృతి పెరిగింది. యమునా నది ఇంత తీవ్రస్థాయిలో ప్రవహించడానికి కారణం ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతో పాటు నదిలో పూడిక పెరిగిపోవడం కూడా ముఖ్యకారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం, వ్యాపారులు వారి స్వలాభం కోసం విచ్చలవిడిగా పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, ప్రజలు బాధ్యతారాహిత్యంగా ఉండటం మాననన్ని రోజులు ఇలాంటి ప్రకృతి విపత్తులు వస్తూనే ఉంటాయి.

- మోతె రవికాంత్, అధ్యక్షుడు, సెఫ్​ ఎర్త్​ ఫౌండేషన్