మునుగోడు బై పోల్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతైంది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 13 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 20వేల లోపు ఓట్లను మాత్రమే సాధించారు. దీంతో ఆమెకు ఎన్నికల డిపాజిట్ దక్కే అవకాశం లేదు. శాసనసభకు పోటీ చేయాలంటే రూ.10వేలను అభ్యర్థి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేలు చెల్లిస్తే చాలు. పోలైన మొత్తం ఓట్లలో అభ్యర్థికి కనీసం ఆరింట ఒక వంతు ఓట్లు రావాల్సి ఉంటుంది. అంటే 16.6 శాతం ఓట్లను అభ్యర్థి సాధించగలిగితే డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. కానీ పాల్వాయి స్రవంతి 16.6 శాతం ఓట్లను సాధించలేకపోయారు. దీంతో ఆమె డిపాజిట్ ను దక్కించుకునే చాన్స్ ను కోల్పోయారు. మరోవైపు బై పోల్ 13వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. విజయం దిశగా ఆ పార్టీ దూసుకెళ్తోంది. 13 రౌండ్లు ముగిసే సరికి మొత్తం 9,039 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది.
వర్గ విభేదాల వల్లే..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు బై పోల్ ప్రచారంలో పాల్గొనకపోవడం, పాల్వాయి స్రవంతికి మద్దతును ప్రకటించకపోవడం కాంగ్రెస్ పాలిట ప్రతికూల అంశంగా పరిణమించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా మునుగోడులో ప్రచారం చేసినా పెద్దగా స్పందన రాలేదు. మొత్తంగా కాంగ్రెస్ లోని వర్గ విభేదాలు ఆ పార్టీకి చేటు చేశాయని చెప్పొచ్చు. బై పోల్ లో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ‘నేను ఒంటరినయ్యాను. ఎవరూ సహకరించడం లేదు’’ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లోని వర్గ విభేదాలకు నిదర్శనంగా నిలిచాయి.