డిజిటల్ అరెస్ట్ పేరుతో బిల్డర్ నుంచి కోటి కొట్టేసిన్రు

డిజిటల్ అరెస్ట్ పేరుతో బిల్డర్ నుంచి కోటి కొట్టేసిన్రు

అహ్మదాబాద్‌‌: ఓ బిల్డర్‌‌‌‌ను డిజిటల్‌‌ అరెస్ట్‌‌ చేసి, బెదిరించి కేటుగాళ్లు కోటి రూపాయలు కొట్టేశారు. జులై 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఇంటర్నేషనల్‌‌ కొరియర్ కంపెనీ పేరుతో అహ్మదాబాద్‌‌కు చెందిన ఓ బిల్డర్‌‌‌‌కు ఫోన్‌‌ చేసి, మీ పేరుపై ఓ పార్సిల్‌‌ వచ్చిందని, అందులో 550 గ్రాముల డ్రగ్స్‌‌ ఉన్నట్లు చెప్పాడు. ఈ కాల్‌‌ను నార్కోటిక్స్‌‌ కంట్రోల్‌‌ బ్యూరో (ఎన్‌‌సీబీ)కు ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేస్తున్నామని చెప్పారు. వెంటనే యూనిఫాం వేషంలో పోలీసులు, ఎన్‌‌సీబీ అధికారులు బాధితుడికి వీడియో కాల్‌‌లోకి వచ్చారు. 

డ్రగ్స్‌‌ కేసులో మీపై కేసు నమోదైందని బిల్డర్‌‌‌‌ను బెదిరించారు. స్టేట్‌‌మెంట్ రికార్డు చేయడం కోసమే తాము ఆన్‌‌లైన్‌‌లోకి వచ్చామని చెప్పారు. మీ బ్యాంక్‌‌ అకౌంట్‌‌లో అనుమానాస్పద లావాదేవీలు కూడా జరిగాయన్నారు. వీటిపై సీబీఐ, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ), ఎన్‌‌సీబీ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అలాగే, రూ.50 కోట్ల విలువ చేసే ఓ ల్యాండ్‌‌ డీల్‌‌లో మీ పాత్ర కూడా ఉందని బెదిరించారు. 

దీంతో బిల్డర్‌‌‌‌ కంగారుపడిపోయాడు. వీడియో కాల్‌‌లో అది గమనించిన నేరగాళ్లు.. కోటి రూపాయలు తమ అకౌంట్‌‌కి ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేస్తే, విచారణను నిలిపివేస్తామని చెప్పారు. ఆ డబ్బును 10 రోజుల్లో తిరిగి ఇస్తామని నమ్మించారు. వాళ్ల మాటలు నమ్మిన బిల్డర్‌‌‌‌.. వెంటనే కోటి రూపాయలు వారికి ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత వారి కాంటాక్ట్‌‌ అవ్వగా, ఎవ్వరూ అందుబాటులోకి రాలేదు. దీంతో బిల్డర్‌‌‌‌ తాను మోసపోయాయని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.