కొత్త విద్యావిధానంలో పనికిరాని సిలబస్

పీడీఎస్ యూ మహాసభలో ప్రొఫెసర్ హరగోపాల్

హనుమకొండ సిటీ, వెలుగు: కొత్త జాతీయ విద్యావిధానం పేరుతో  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనికిరాని సిలబస్ ను విద్యారంగంలో ప్రవేశపెడుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్​యూ) తెలంగాణ  రాష్ట్ర 3వ మహాసభలు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజి ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. అంతకుముందు హనుమకొండలోని ఏకశిలా పార్కు నుంచి ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం వరకు స్టూడెంట్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్​ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రొఫెసర్​ హరగోపాల్ మాట్లాడారు. అనేక రంగాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న దేశ పాలకులు  కామన్ విద్యావిధానంలో ఎందుకు విఫలం అయ్యారన్నారు. పేద, దళిత, గిరిజన వర్గాల స్టూడెంట్లు ఎక్కువగా డ్రాపవుట్​అవుతున్నారన్నారు.

స్టూడెంట్ల ఆర్థిక, సామాజిక స్థితిగతులే ఇందుకు ప్రధాన కారణమన్నారు. రాష్ట్రంలో  విశ్వవిద్యాలయాలను పూర్తిగా ధ్వంసం చేశారని, వాటికి నిధులు కేటాయించకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సామాజిక సమస్యలపై పరిష్కారం చూపే మేధోపరమైన చర్యలు యూనివర్సిటీల్లో జరగడం లేదని, ఇది సమాజానికి మంచిది కాదన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ పీడిత ప్రజల పక్షాన స్టూడెంట్లు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా కాలంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అలాంటపుడు అదానీ, అంబానీ కంపెనీలకు లక్షల కోట్ల లాభాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్ధన్, ఇప్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి ఆరెళ్లి కృష్ణ, పీడీఎస్ యూ జాతీయ కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.