ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్ల పేరుతో..ఐటీ కంపెనీకి రూ.3 కోట్ల టోకరా

ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్ల పేరుతో..ఐటీ కంపెనీకి రూ.3 కోట్ల టోకరా

గచ్చిబౌలి, వెలుగు: ఓ ఐటీ కంపెనీలో జాబ్ మానేసి వెళ్లిపోయిన వారికి ఫైనల్ సెటిల్మెంట్ల పేరుతో  ఆ కంపెనీ ఉద్యోగి భారీ మొత్తంలో టోకరా వేశాడు. ఏకంగా రూ. 3.22 కోట్లను బినామీ బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో ఉన్న అమెజాన్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్ (ఇండియా) అనే ఐటీ కంపెనీలో ఈ స్కాం చోటుచేసుకుంది. ఈ ఐటీ కంపెనీలో మెట్టు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్- పేరోల్ గా విధులు నిర్వహించాడు. 

సంస్థను వదిలిపెట్టిన ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్లతో పాటు అమెజాన్ ఉద్యోగుల ఎండ్ టు ఎండ్ పేరోల్ కార్యకలాపాలను అతడు నిర్వహించేవాడు. అయితే, కంపెనీని వదిలిపెట్టిన, మాజీ ఉద్యోగుల్లో కొందరికి ఫైనల్ సెటిల్మెంట్ కాకుండా చాలా రోజులుగా పెండింగ్ లో ఉండడం గమనించిన వెంకటేశ్వర్లు భారీ స్కాం కు స్కెచ్ వేశాడు. సంస్థలో పనిచేస్తున్న తన అనుచరులతో కలిసి మాజీ ఉద్యోగుల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాల స్థానంలో కొత్త ఖాతాలను ఎంటర్ చేశాడు. 

తర్వాత సదరు మాజీ ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్ చేసి, వారికి వెళ్లవలసిన డబ్బును తన బినామీ ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఇలా ఆ సంస్థలో గతంలో పనిచేసిన184 మంది మాజీ ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్ చేసి రూ. 3.22 కోట్లను తన స్నేహితులు, బంధువుల పేర్లతో ఉన్న 50 బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడు. 2016 నుంచి 2023 మధ్య ఈ స్కాంకు పాల్పడ్డాడు. అయితే, సంస్థలో ఫ్రాడ్ జరిగిన విషయాన్ని ఇటీవలే గుర్తించిన నిర్వాహకులు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్​ చేశారు.