- అగ్గువ సగ్గువకు అసైన్డ్ భూముల సేకరణ, ఏడాదిలో 8,894 ఎకరాలు సేకరణ
- పబ్లిక్ హియరింగ్ లో రైతులు వ్యతిరేకించినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
- 25 జిల్లాల్లో 11,500 ఎకరాల భూసేకరణ లక్ష్యం
- సేకరించింది పోనూ 2,606 ఎకరాలకు విడతలవారీగా నోటిఫికేషన్లు
- భూములు గుంజుకుంటే తాము బతికేదెట్ల అంటున్న రైతులు
వరంగల్ ప్రతినిథి, వెలుగు: ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల పేరిట ప్రభుత్వం పేదల అసైన్డ్ భూములను గుంజుకుంటున్నది. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం ఆక్రమించుకుంటున్నది. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో 11,500 ఎకరాలు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకోగా.. ఏడాదిలోనే ఇందులో 8,894 ఎకరాలు తీసుకుంది. అసైన్డ్ భూములపై మీకు హక్కులు లేవని, ప్రభుత్వానికి ఎప్పుడంటే అప్పుడు తీసుకునే అధికారం ఉందంటూ బలవంతంగా తీసుకుంటున్నది. పబ్లిక్ హియరింగ్‌లో తమ భూములివ్వబోమని రైతులు తెగేసి చెప్పినా ప్రభుత్వం వినడం లేదు. అసైన్డ్ భూములనే సాకుతో ఎకరాకు రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉపాధిపై సర్కార్ నుంచి ఎలాంటి హామీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టార్గెట్ 11,500 ఎకరాలు
రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఆ టార్గెట్ ఇప్పుడు 11,500 ఎకరాలకు పెరిగింది. ఒక్కో జిల్లాలో కనీసం 500 ఎకరాలకు తగ్గకుండా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోయే అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వం కేవలం అసైన్డ్ భూములనే సేకరించడం వివాదాస్పదంగా మారింది. తమ భూములు ఇవ్వబోమని రైతులు వ్యతిరేకించినా ప్రభుత్వం ఆగడం లేదు.
అభ్యంతరాలున్నా.. రాలేవంటూ..!
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో మొత్తం 297 ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 114 ఎకరాలను గతంలో సేకరించారు. మిగతా 182.39 ఎకరాల భూసేకరణకు మే 9న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భూములన్నింటిని దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చి.. స్వయంగా పేదలకు పంచినవే. అలాగే.. మే నెలలో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపూర్‌లో సర్వే నంబర్ 58లోని 229 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదే జిల్లాలోని మునిపల్లి మండలం లింగంపల్లిలోనూ 487 ఎకరాల సేకరించాలని నిర్ణయించారు. మే నెలలో వెంకటాపూర్ , లింగంపల్లిలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించగా.. భూములు ఇచ్చేది లేదని రైతులు చెప్పారు. వెంకటాపూర్‌లోని 58వ సర్వే నంబర్లోని భూములకు ఎకరానికి రూ.5.65 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు ప్రకటించగా.. అంత తక్కువ పరిహారం తీసుకునేది లేదని రైతులు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ భూములపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదంటూ ప్రభుత్వం ఈనెల 17న ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఏ జిల్లాలో ఎంతంటే..
రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 1,457 ఎకరాలకుగాను ఇప్పటికే 587 ఎకరాలు సేకరించగా.. మరో 870 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. కరీంనగర్ జిల్లా ఓగులాపూర్‌లో 1,289 ఎకరాలకుగాను 1266 ఎకరాల సేకరణ పూర్తయింది. నారాయణపేట జిల్లా కంసామ్పల్లిలో 1,024.13 ఎకరాలు సేకరించారు. నిర్మల్ జిల్లా బాసరలో 620.26 ఎకరాలు, కామారెడ్డి జిల్లా లింగంపల్లిలో 675.24 ఎకరాలు, మెదక్ జిల్లా ఘన్‌పూర్‌లో 526.08 ఎకరాలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నార్మలలో 309.05 ఎకరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో 206 ఎకరాలు సేకరించారు. నల్గొండ జిల్లా ఆలగడపలో 440.19 ఎకరాలు, నాగర్ కర్నూల్ జిల్లా సర్వారెడ్డిపల్లిలో 412 ఎకరాలు, మంచిర్యాల జిల్లా బుద్ధ కలాన్‌లో 355.03 ఎకరాలు, జగిత్యాల జిల్లా మెట్లచిత్తాపూర్లో 197.07 ఎకరాలు, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 166 ఎకరాలు, జోగులాంబ గద్వాల జిల్లా దోర్నాలలో 166.10 ఎకరాలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 165.24 ఎకరాలు, వరంగల్ జిల్లా ఎల్గూరులో 160 ఎకరాలు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో 157 ఎకరాలు, గంభీర్ పూర్లో 151 ఎకరాలు, జనగామ జిల్లా దేవరుప్పులలో 145 ఎకరాల చొప్పున ఆయా జిల్లాల్లో సేకరించింది.
ఇయ్యనంటే బెదిరిస్తున్నరు
ఏదో ఫ్యాక్టరీ కడుతమంటు న్నరు. దానికి లింగంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 108/85లో నాకున్న ఎకరా 20 గుంటల భూమి కావా లని జబర్దస్తీ చేస్తున్నరు. ఇయ్యనని మొండికేస్తే బెదిరిస్తున్నరు. ఉన్న కొంత భూమి ఇచ్చేస్తే ఏం చేసుకొని బతకాలి? వ్యవసాయమే జీవనోపాధిగా బతుకు తున్నం. దయచేసి న్యాయం చేయండి. పేదల భూములు గుంజుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు.
- పరం నాగమణి, లింగంపల్లి, సంగారెడ్డి జిల్లా
భూములు గుంజుకుంటే మేం ఏం చేసి బతకాలి?
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల పేరుతో ప్రభుత్వం మా భూములు గుంజు కోవాలని చూస్తోంది. సర్వే నంబర్ 521లో వంద ఎక రాల భూమి కంపెనీలకు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ భూముల్లో నాతోపాటు కొంతమంది రైతులు తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుం టున్నారు. ఉన్న కొద్ది భూమిని సర్కారోళ్లు తీసుకుంటే మేం ఏం చేసి బతకాలి?
- మహంకాళి సాయిమల్లు, మడిపల్లి(తొర్రూరు), మహబూబాబాద్
బలవంతంగా జేసీబీలతో రోలింగ్ చేసిన్రు
నాకు 456 సర్వే నంబర్లో ఎకరా భూమి ఉంది. మా తాత, ముత్తాతల కాలం నుంచి దీన్నే నమ్ముకొని బతుకుతున్నం. వానా కాలంలో వరి, యాసం గిలో తైదలు, జొన్న వేస్తం. మే 13న కంపెనీలు పెడతామని మా భూములు తీసుకునేందుకు ఆఫీసర్లు వచ్చిన్రు. బలవంతంగా మా భూముల్లో జేసీబీలతో రోలింగ్ చేసిన్రు. ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్లకు మా భూములు ఇచ్చేదే లేదు. ఈ భూమిని వదులుకునే ముచ్చట్నే లేదు.
- బ్యాగరి మన్యం, రైతు, హన్వాడ, మహబూబ్ నగర్