ఉత్తుత్తి కొనుగోళ్లు, అమ్మకాలు చూపి..  రూ.45 కోట్లు కొట్టేశారు

ఉత్తుత్తి కొనుగోళ్లు, అమ్మకాలు చూపి..  రూ.45 కోట్లు కొట్టేశారు
  • ఉత్తుత్తి కొనుగోళ్లు, అమ్మకాలు చూపి..  రూ.45 కోట్లు కొట్టేశారు
  • జీఎస్టీ రీఫండ్ పేరిట సర్కార్​కే టోకరా 
  • మనుషులు ఉండరు.. బిల్స్ మాత్రం ఉంటయ్​  
  • ఆటో మొబైల్ పార్ట్స్ కొన్నట్లు.. ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మినట్లు కాగితాలు   
  • 18%  జీఎస్టీ నుంచి 5% జీఎస్టీకి ఇచ్చామంటూ రీఫండ్​కు అప్లై   

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో జీఎస్టీ రీఫండ్​పేరిట భారీగా మోసాలు జరుగుతున్నాయి. అసలు బిజినెస్ చేయకుండానే.. కొనుగోళ్లు, అమ్మకాలు జరిపినట్లు కాగితాల్లో లెక్కలు చూపి కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకే కన్నం పెడుతూ భారీ దందా సాగిస్తున్నారు. ఎలక్ట్రిక్ బైక్ లు తయారు చేస్తున్నట్టుగా ఏడు కంపెనీల తరఫున ఏడుగురు వ్యక్తులు జీఎస్టీ రీఫండ్ కోసం అప్లై చేసి.. ఏకంగా రూ.45.67 కోట్లు రీఫండ్ తీసుకున్నట్లు తాజాగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. 

ఇలా ఫ్రాడ్ చేశారు.. 

ఢిల్లీలో రిజిస్టర్ అయిన కొన్ని కంపెనీల నుంచి ఆటో మొబైల్ పార్ట్స్ ను18% జీఎస్టీతో కొన్నట్లు కాగితాల్లో చూపించారు. ఆ తర్వాత వాటిని తెలంగాణలో ఎలక్ర్టిక్​ బైక్​లకు అమర్చి అమ్మకాలు జరిపినట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బైక్​లకు 5% జీఎస్టీ మాత్రమే ఉందని.. తాము 13 శాతం ట్యాక్స్ నష్టపోతున్నామని చెప్తూ జీఎస్టీ రీఫండ్ కు అప్లికేషన్ పెట్టుకున్నారు. అలా రూ.45.67 కోట్లు ఖజనాకు చేరిన సొమ్మును మోసపూరితంగా కొల్లగొట్టారు. ఇందులో శివసాయి ఎంటర్​ప్రైజెస్ 2.98 కోట్లు, మార్గమ్ ఎలక్ట్రిక్ బైక్స్ రూ.4.95 కోట్లు, అపెక్స్ ఎలక్ర్టిక్ బైక్స్ రూ.3.99 కోట్లు, గ్రో మోర్ ఎలక్ర్టిక్స్ బైక్స్ రూ.3.40 కోట్లు, యోక ఎలక్ర్టిక్ బైక్స్ రూ.4.51 కోట్లు, సుప్రియ ఎలక్ర్టిక్​ బైక్స్ రూ.2.01 కోట్లు,  విన్​రాధ్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.23.78 కోట్లు అక్రమంగా మోసం చేసి జీఎస్టీ రీఫండ్​ తీసుకున్నట్లు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్​ చేసి కొంత రికవరీ చేశారు. మిగిలిన వాళ్లు పరారీలో ఉన్నారు. 

రీఫండ్స్​పై సర్య్కులర్ ​జారీ   

భారీ మొత్తాలతో కూడిన రీఫండ్‌ల కోసం తరచూ క్లెయిమ్‌లు జరుగుతున్నందున వీటిపై మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులను కమర్షియల్​ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఒక సర్య్కులర్ జారీచేశారు. అధికారి రీఫండ్​కు ఫైనల్ ఆర్డర్ ఇచ్చే ముందు ఉన్నతాధికారుల పరిశీలనకు తీసుకెళ్లి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాసెస్ చేస్తున్నప్పుడు రీఫండ్ పెట్టుకున్న వాళ్లు అవసరమైన డాక్యుమెంటరీ సాక్ష్యాలను దాఖలు చేశారా? లేదా? అన్నది సదరు అధికారి ధ్రువీకరించుకున్న తర్వాతే డిసిగ్నేటెడ్​ ఆఫీసర్​కు పంపాలని సూచించారు. వ్యాపారం, టాక్స్​విధించదగిన వ్యక్తి నిజంగా ఉన్నారని, సర్టిఫైడ్ సంస్థల నుంచే సప్లై చేస్తున్నారని నిర్ధారణ చేసుకున్నాకే ప్రాసెస్ చేయాలని పేర్కొన్నారు.