వడ్ల కాంట పెట్టినంక తరుగు తీస్తున్న మిల్లర్లు

  • వడ్ల కాంట పెట్టినంక తరుగు తీస్తున్న మిల్లర్లు
  • కొనుగోలు కేంద్రంలో క్వింటాల్​కు కిలోకు పైగా.. 
  • మిల్లులో లారీకి 4 నుంచి 5 క్వింటాళ్లు కట్
  • అడుగడుగునా  రైతుల  దోపిడీ

 

కొనుగోలు కేంద్రంలో కాంట వేసిన వడ్లు లారీలో ఆలేరులోని ఓ రైస్​ మిల్లుకు చేరుకున్నాయి. లారీ రాగానే వడ్లు చూసిన మిల్లర్​.. ‘తేమ ఎక్కువగా ఉంది. తూకంలో తేడా వస్తది. లారీ పేరు మీద 5 క్వింటాళ్లు కట్​ చేస్తా’ అని అన్నాడు.  రైతులు ఒప్పుకోరని చెబుతున్నా.. వినలే..సేమ్​ సీన్​ రాజాపేట మండలంలోని రైస్​ మిల్లు వద్ద కనిపించింది. ఒక్కో లారీకి 5 క్వింటాళ్లు కట్​ చేస్తామని సదరు మిల్లర్​చెబుతున్నాడు. ఇదేదో ఒక్క కొనుగోలు కేంద్రం, ఒక్క మిల్లుకే పరిమితం కాదు. యాదాద్రి జిల్లాలోని చాలా మండలాల్లో  ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి.

యాదాద్రి, వెలుగు: 
తేమ పేరుతో యాదాద్రి జిల్లాలోని కొందరు రైస్​ మిల్లర్లు వడ్ల తూకంలో కోతలు విధిస్తున్నారు. క్వింటాల్​కు రెండు కిలోలు కొనుగోలు కేంద్రం వద్ద, మిల్లుకు పోయినంక 650 నుంచి 800 బస్తాల లోడ్​తో వెళ్లిన లారీకి 4 నుంచి 5 క్వింటాళ్లు తగ్గిస్తున్నారు. దీంతో రైతులకు తెలియకుండానే నష్టం కలుగుతోంది. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. 

మిల్లర్ల ఇష్టారాజ్యం..

యాదాద్రి జిల్లాలో ఈ వానాకాలం 3.05 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేశారు. ఈసారి 90 శాతం వరకు దొడ్డురకం వరే సాగు చేశారు. దీంతో దాదాపు 6 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. అంచనాలకు తగ్గట్టుగా 305 కొనుగోలు కేంద్రాలు ఓపెన్​ చేసినా.. ఈసారి ఎక్కువగా జిల్లాలోని సీఎంఆర్​ లోటు పూడ్చుకోవడం కోసం  కొందరు రైస్​ మిల్లర్ల తరఫు దళారులతో పాటు పక్క జిల్లాలు, ఏపీలోని కాకినాడ నుంచి కూడా దళారులు వచ్చారు. కల్లంలోని వడ్లనే  తేమ, తాలు పట్టించుకోకుండా క్వింటాల్​కు రూ. 1,650 నుంచి రూ. 1,800 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో  ఎక్కువ మంది రైతులు దళారులకే అమ్ముకున్నారు. కొందరు రైతులు మాత్రం మద్దతు ధర రూ. 2,060 వస్తుందని కొనుగోలు కేంద్రానికి పోతే మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఖాళీ బస్తాను కలుపుకొని 41 కిలోల వడ్లను తూకం వేయాలని ఆఫీసర్లు ముందుగానే తెలిపారు. అయితే మిల్లర్లు ఇబ్బందులు పెడతారన్న ఉద్దేశంతో ముందుగానే 42 కిలోల చొప్పున వడ్లను తూకం వేయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. 

కొనుగోలు కేంద్రాల్లో  తూకం తర్వాత మిల్లు వద్దకు వెళ్లిన తర్వాత మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. వడ్లలో తేమతో పాటు తాలు కూడా ఉందంటున్నారు. క్వింటాల్​కు కిలో  తగ్గిస్తామని చెబుతున్నారు. దీంతో వడ్లన్నీ ఒకే రైతుకు చెందినవి కాదని, రైతులు ఒప్పుకోరని చెబుతున్నా.. కొందరు మిల్లర్లు పట్టించుకోవడం లేదు. ఆలేరు పీఏసీఎస్​ పరిధిలోని కొనుగోలు కేంద్రాల నుంచి  ఆలేరులోని ఓ రైస్​ మిల్లుకు వడ్ల లారీలు వెళ్లగా,  సదరు మిల్లర్ ​లారీకి 5 క్వింటాళ్లు కట్​ చేస్తానని తేల్చి చెప్పాడు. రాజాపేటలోని ఓ మిల్లరు కూడా ఇదే విధంగా లారీకి 5 క్వింటాళ్ల చొప్పున కట్​ చేశారు. దీంతో రైతులందరూ తలా కొంత నష్టం భరించాల్సి వచ్చింది. మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆఫీసర్లకు సమాచారం  ఇచ్చినా  వారు స్పందిస్తలేరని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 2.50 లక్షల టన్నుల వడ్లను కేంద్రాల్లో కొనుగోలు చేశారు. జిల్లాలోని రైస్​మిల్లర్లు, దళారులు మరో 2.50 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఏర్పాటు చేసిన 305 సెంటర్లలో ఇప్పటికే దాదాపు వంద సెంటర్లు మూసి వేశారు. 

ఫిర్యాదు వస్తే విచారణ చేయిస్తాం

తూకం వేసిన తర్వాత మిల్లర్లు అలాగే తీసుకోవాలి. తేమ పేరుతో కటింగ్ చేయొద్దు.  మిల్లుకు వడ్లు వచ్చిన తర్వాత  కోతలు విధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఈ విషయంపై ఫిర్యాదులు వస్తే విచారణ చేయిస్తాం.  
-  పరిమళా దేవి, డీసీవో, యాదాద్రి జిల్లా