
తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్ అందుతోంది. విఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫొటో వాట్సప్ డీపీగా పెట్టి ఓ కేటుగాడు.. భక్తుల నుంచి అందినకాడికి డబ్బు దోచుకున్నాడు. ముఖ్యంగా ఎన్ఆర్ఐ భక్తులను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడ్డాడు.
విఐపీ బ్రేక్ దర్శనం, సుప్రభాత సేవ, ఆర్జిత సేవ టికెట్ల అందుబాటులో ఉన్నాయని.. కావలసిన వారు తనను సంప్రదించాలని తిరుమల సమాచారం వాట్సప్ గ్రూప్‌లో పోస్టులు పెట్టేవాడు. ప్రొపైల్ పిక్‌గా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫొటో ఉండటంతో.. ప్రకటన నిజమని నమ్మి ఫోన్లు చేసిన భక్తులను నిండా ముంచేవాడు. ఈ విషయాన్ని మోసపోయిన భక్తులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లగా.. కేటుగాడి బాగోతం బయటపడింది.
ఫోన్ నంబర్ ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావెద్ ఖాన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భక్తులను మోసగించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని విజిలెన్స్ & పోలీసు అధికారులను టీటీడీ చైర్మన్ అదేశించారు.