
- ప్రైవేటు ఏజెంట్లను నియమించుకుని దందా
- పరిహారం అందిన తరువాత అందరికీ వాటాలు
- బ్రోకర్లపైనే యాక్షన్.. ఆఫీసర్లపై చర్యలు తీసుకోని పోలీసులు
హనుమకొండ, వెలుగు : లేబర్ఆఫీస్లో కార్మికుల ఇన్సూరెన్స్ పేరుతో దందా కొనసాగుతూనే ఉంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నుంచి వసూళ్లు చేపట్టి, నకిలీ చలాన్లు, లేబర్‌కార్డులు సృష్టించి.. అర్హత లేకున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేస్తున్నారు. ఇందులో బ్రోకర్లు ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. తెరవెనుక ఆఫీసర్లే అంతా నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అప్లికేషన్ వచ్చింది మొదలు.. ఎంక్వైరీ, అప్రూవల్ వరకు అసిస్టెంట్లేబర్ఆఫీసర్లే అన్నీ చూసుకుంటున్నారు. ప్రైవేటు ఏజెంట్లను నియమించుకుని మరీ దందా సాగిస్తున్నారు. రెండ్రోజుల కిందట పరకాల ఏఎల్వో నియమించుకున్న ఏజెంట్లు, ఇతర గ్యాంగ్పట్టుబడడమే ఈ దందాకు సాక్ష్యంగా నిలుస్తుండగా.. మిగతా ప్రాంతాల్లోనూ ఇదే తరహా బాగోతం నడుస్తోంది.
ఏజెంట్లదే హవా..
లేబర్ కార్డు కలిగిన లబ్ధిదారుడు చనిపోతే బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తుంటుంది. నార్మల్ డెత్ అయితే రూ.1.30 లక్షలు, యాక్సిడెంటల్‌గా చనిపోతే రూ.6.30 లక్షలు చెల్లిస్తుంటుంది. లేబర్డిపార్ట్మెంట్ అందించే పరిహారం కోసం ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేసి, లబ్ధిదారు కార్డు, డెత్ వివరాలు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే పరిహారం కోసం అప్రూవల్ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మంది ఏఎల్వోలు ఉండగా.. అందులో కొందరు ఆఫీసర్లు ప్రైవేటు ఏజెంట్లను నియమించుకున్నారు. ఫీల్డ్ ఎంక్వైరీ నుంచి మొదలు అన్ని వ్యవహారాలు వారితోనే చక్కబెడుతున్నారు. కొందరు ఆఫీసర్లు తమ అఫీషియల్ లాగిన్ ఐడీలు కూడా ఏజెంట్లకు ఇచ్చి, అప్లికేషన్ వెరిఫికేషన్ నుంచి ఇన్సురెన్స్ అప్రూవల్స్ దాకా అన్నీ వారితోనే చేయిస్తుండటం గమనార్హం.
కార్డు లేకున్నా ఓకే..
ఏఎల్వోలు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు తమ కింద మరికొంతమందిని నియమించుకుంటున్నారు. దీంతో కింది స్థాయి బ్రోకర్లు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే.. దశ దిన కర్మ పూర్తికాకముందే వారి ఇండ్ల ముందు వాలిపోతున్నారు. ఆ తరువాత చనిపోయిన వ్యక్తికి లేబర్ కార్డు ఉందో.. లేదో ఆరా తీస్తున్నారు. కార్డు ఉంటే ఇన్సురెన్స్ తొందరగా క్లెయిమ్ చేయిస్తామంటూ మాట కలిపి, పర్సంటేజీలు మాట్లాడుతున్నారు. ఒకవేళ కార్డు లేదని తెలిస్తే.. చనిపోయిన వ్యక్తి ఆధార్, రేషన్ కార్డు, ఇతర పేపర్లు కలెక్ట్ చేస్తున్నారు. ఆ తరువాత చనిపోయిన వ్యక్తి గతంలోనే పొందినట్లుగా లేబర్ కార్డులు తయారు చేస్తున్నారు. అయితే 2019 నుంచి లేబర్ డిపార్ట్మెంట్ కు కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి రాగా.. అందులో లేబర్ కార్డు కోసం లబ్ధిదారులు కట్టే మీ సేవా చలాన్లను వెరిఫై చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. కానీ బ్యాంక్ చలాన్లను వెరిఫై చేసే అవకాశం లేకపోవడంతో.. అలాంటి చలాన్ల ఆధారంగా దందా సాగిస్తున్నట్లు తెలిసింది. అంతేగాకుండా తరచూ లేబర్ డిపార్ట్మెంట్ సైట్ మొరాయిస్తుండటం, అందులోని లోపాలను గుర్తించి ఏజెంట్లు ఆఫీసర్ల సహకారంతో ఈ బాగోతం నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఆఫీసర్లపై ఎంక్వైరీ ఏది?
లేబర్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న దందాలపై ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు నజర్ పెట్టారు. కొ ద్దిరోజుల కిందట ఓ పెద్దాఫీసర్ నియమించుకున్న ఏజెంట్.. లైసెన్స్రిన్యూవల్ పేరున అక్రమంగా వసూళ్లకు పాల్పడుతుండగా.. అరెస్ట్ చేశారు. రెండ్రోజుల కిందట పరకాల ఏఎల్వో నియమించుకున్న ఏజెంట్‌తో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వెనుక కొందరు ఆఫీసర్లే ఉన్నారని తెలిసినా పోలీస్ అధికారులు కూడా వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేవలం బ్రోకర్లపైనే పోలీసులు ప్రతాపం చూపుతున్నారని, అసలు సూత్రధారులపై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దందా విషయం బయటపడిన తరువాత డిపార్ట్మెంట్ పెద్దాఫీసర్లేగానీ, లోకల్ పోలీసులే గానీ ఎలాంటి ఎంక్వైరీ చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా లేబర్ డిపార్ట్మెంట్ పెద్దాఫీసర్లు, పోలీసులు కార్మిక బీమా పేరున సాగుతున్న దందాకు అడ్డుకట్ట వేయాలని, లేదంటే ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.