వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఆరు సెగ్మెంట్లలో రసవత్తర పోరు

  •     ఈసారి గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందనే ఆశలు
  •     ఇప్పటి నుంచే పక్కాగా రాజకీయ వ్యూహాలు 

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని ఆరుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన ఆ ఎమ్మెల్యేలు.. హ్యాట్రి క్​ విజయాన్ని సాధించేందుకు ఆరాట పడుతున్నారు. కాంగ్రెస్​ కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో 12 మంది బీఆర్​ఎస్​ ఎమ్మె ల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లలో  జిల్లా మంత్రి జి. జగదీశ్​రెడ్డి సొంత నియోజకవర్గం సూర్యాపేటతోపాటు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, మిర్యాల గూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ లీడర్లను తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఆరు చోట్ల బీఆర్ఎస్​, కాంగ్రెస్​కు దీటుగా బీజేపీ బలపడుతోంది. 

వెంటాడుతున్న భయం..

వరుసగా రెండుసార్లు విజయాన్ని అందించిన ప్రజలు ఈసారి చెయ్యిస్తారేమోనన్న భ యం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. విధిలేని పరిస్థితుల్లో ట్రయాంగిల్​ వార్​ ఎదురైతే దాన్ని తట్టుకు ని ఏ రకంగా నిలబడాలనే దాని పైన తర్జనభర్జన పడుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అంతగా ప్రభావితం చూపకపోయినప్పటకీ సూర్యాపేట, తుంగతుర్తిలో మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్ కుమార్​కాంగ్రెస్​ నుంచి గట్టిపోటీ ఎదుర్కోక తప్పలేదు. తుంగతుర్తిలో కాంగ్రెస్​ నుంచి ఒకరు, రెబల్​గా మరొకరు పోటీ చేయడంతో ఓట్లు చీలి కిషోర్​కుమార్​ 1847 ఓట్లతో గట్టెక్కారు. సూర్యాపేటలో కాంగ్రెస్​ గట్టిపోటీ ఇవ్వడంతో జగదీశ్​రెడ్డి 5,967 ఓట్లతో బయటపడ్డారు.

అదే ఆలేరు, భువనగిరి, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లు భారీ మెజార్టీతో గెలుపొందారు. కానీ 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగే ఎన్నికలు ఆరుగురు ఎమ్మెల్యేలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.బీఆర్ఎస్​లో మొదటి సారి గెలుపొందిన ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అధికార పార్టీ సర్వేల్లో తేలింది. ఫస్ట్​ టైం ఎమ్మెల్యేల గురించే హైకమాండ్ ఇంకా ఆలోచన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మూడోసారి గెలుపొందాలనే పట్టుదలతో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏరకంగా ఉంటుందనే దాని పైన రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

రాజకీయ వ్యూహాలకు పదును...

ప్రభుత్వ సంక్షేమ పథకాలనే నమ్ముకుంటే సరి పోదని భావిస్తున్న ఎమ్మెల్యేలు కేడర్​పై  ఫోకస్​ పెట్టారు. పార్టీలో అంతర్గత కుమ్మలాటలు, భూదందాలు, ఇసుక మాఫియా, లిక్కర్​ మాఫి యా, స్థానిక పదవుల్లో కుల సమీకరణాలు పాటించలేదనే ఆరోపణలు ఎమ్మెల్యేలు ఎదుర్కొం టున్నారు. పదవుల పంపకాల్లో సొంత పార్టీ నేతలను పక్కన పెట్టడం, ఉద్యమనేతలను పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిన్నింటి నుంచి గట్టేక్కేందుకే ఎమ్మెల్యేలు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా క్యాడర్​ను దగ్గర తీస్తున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు ఉంటదని చెప్తున్న ఎమ్మెల్యేలు ఆపార్టీల ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో జాగ్రత్త పడుతున్నారు. మునుగోడు బైపోల్​తరహాలో వాళ్లతో దోస్తీ కడుతున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడలో కమ్యూనిస్టు ప్రోగామ్స్​లో పాల్గొనడం దీనికి సంకేతమని చెబుతున్నారు.

మిర్యాలగూడలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు ఇటీవలే కార్పొరేషన్​ పదవులు కట్టబెట్టారు. ఆలేరులో కాంగ్రె స్​లోని బలమైన సామాజికవర్గం ఎమ్మెల్యే వర్గానికి బినామీగా పనిచేస్తుందనే టాక్​ వినిపిస్తోంది. ఇక భువనగిరిలో రెడ్డి సామాజికవర్గంలోని ఓ వర్గం ఇన్నాళ్లు ఫైళ్ల శేఖర్​ రెడ్డికి అండగా నిలిచింది. వచ్చే ఎన్నికల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీ నుంచి ఎంట్రీ ఇస్తే ఆ వర్గం ఓటర్లు యూ టర్న్​ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే ‘ఫైళ్ల’ గెలుపు  అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవరకొండలో ఎమ్మెల్యే పైన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అవినీతి ఆరోపణలు, సొంత పార్టీలో గొడవలు పెద్ద తలనొప్పిగా మారాయి. 

హ్యాట్రిక్​ సాధిస్తే మంత్రి పదవి పక్కా..! 

హ్యాట్రిక్​ సాధిస్తే వచ్చే ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కడం ఖాయమన్నట్టు గానే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆలేరు ఎమ్మెల్యే సునీతకు మహిళా కోటాలో దక్కాల్సిన  మంత్రి పదవి మొన్నటి సారి మిస్​ అయింది. సబితా ఇంద్రారెడ్డి పార్టీలో చేరడంతో సునీత ప్రభుత్వ విప్​తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈసారి గెలిస్తే మంత్రి పదవి వస్తదని ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కోటాలో కిషోర్​కుమార్, రవీంద్ర కుమార్ రేసులో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి ఏపీలో మోత్కుప ల్లి నర్సింహులకు కేబినెట్​లో చోటు దక్కింది. మళ్లీ ఇప్పటి వరకు ఆ వర్గా నికి చాన్స్​ ఇవ్వలేదు.

అదేవిధంగా రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్​రావు రేసులో ఉన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. పైగా ఉమ్మడి ఏపీలో నల్గొండ జిల్లాకు ఎప్పుడు ఇద్దరికి కేబినెట్​లో చోటు దక్కేది. కానీ రెండు టర్మ్​ల బీఆర్​ఎస్ పాలనలో మంత్రి జగదీశ్​​ రెడ్డి ఒక్కరికి మాత్రమే చోటు లభించింది. వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు గెలిస్తే తప్పక కెబినెట్​లో ఉమ్మడి జిల్లాకు రెండు బెర్త్​లు ఖాయమని పార్టీ సీనియర్​నేత ఒకరు చెప్పారు. అది కూడా ఈ ఆరుగురిలోనే వాళ్లిద్దరు ఉంటారని ఆ నాయకుడు ‘వెలుగు’తో అన్నారు.