- అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చేరికలతో టెన్షన్
- ఎవరు ఏపార్టీ కోసం పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి
- ఫోన్లు ట్యాప్ చేస్తారనే అనుమానంతో వాట్సాప్ కాల్స్
- గ్రామాలను జల్లెడ పడ్తున్న పోలీస్, ఇంటెలిజెన్స్ టీమ్స్
నల్గొండ, వెలుగు: మునుగోడు ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు కోవర్టుల భయం పట్టుకున్నది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సెకండ్ క్యాడర్ లీడర్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు మారుతుండడంతో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉన్నది. నమ్మి ఏదైనా చెప్తే తమ వ్యూహాలను ప్రత్యర్థి లీడర్లకు ఎక్కడ చేరవేస్తారోననే టెన్షన్ పట్టుకున్నది. ఫోన్లో మాట్లాడితే రికార్డ్ చేసి లీక్ చేస్తారేమోననే అనుమానాలు వెంటాడుతున్నాయి. దీంతో రెగ్యులర్ కాల్స్ బంద్ పెట్టి, వాట్సప్ కాల్స్ మాత్రమే మాట్లాడుతున్నారు.
బూర పార్టీ మారాక సీన్ రివర్స్
మునుగోడులో ఓటర్ నాడిపై రూలింగ్ పార్టీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్, సర్వే రిపోర్టులు తెప్పించుకుంటోంది. దసరా ముందు దాకా మునుగోడులో బీజేపీ కంటే టీఆర్ఎస్ కే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని రిపోర్ట్లు వచ్చాయి. అభ్యర్థిగా ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటించాక, టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓట్ల గ్యాప్ కొంత తగ్గిందని, 7 శాతానికి పడిపోయిందని వెల్లడైంది. ఇటీవల మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారిన తర్వాత పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారాయని టీఆర్ఎస్ హైకమాండ్‌కు నివేదికలు అందాయి. ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటించాక మంత్రి కేటీఆర్ చర్చలతో అసంతృప్తులు చల్లబడ్డాయని అంతా భావించారు. కానీ బూర నర్సయ్య పార్టీ మారి టీఆర్ఎస్ హైకమాండ్‌కు షాక్ ఇచ్చారు. దీంతో రూలింగ్ పార్టీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. అసంతృప్తులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన సెకండ్ క్యాడర్‌పైనా నిఘా పెట్టాలని ఆదేశాలు వచ్చాయి. ప్రచారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల వెంట తిరుగుతున్నవాళ్లలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కోవర్డులు ఉండవచ్చని, అందువల్ల పార్టీ వ్యూహాలేవీ పదిమందిలో మాట్లావద్దని హితోపదేశం చేసింది. దీంతో ఇన్చార్జిలుగా ఉన్న ప్రజాప్రతినిధులంతా తమ వెంట ఉన్న లీడర్లను పూర్తిస్థాయిలో నమ్మడం లేదు. అడపాదడపా వాయిస్ రికార్డులు కూడా బయటకు వస్తుండడంతో వాట్సాప్ కాల్స్‌లో మాత్రమే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా స్థానిక నేతలను నమ్మకుండా తాము వెంట తెచ్చుకున్న అనుచరులకే అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లలో కొందరు కోవర్టులు ఉన్నారనే అనుమానాలతో పార్టీ వ్యూహాలను, కీలకమైన నిర్ణయాలను గుట్టుగా తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఇంటెలిజెన్స్ నిఘా..
టీఆర్ఎస్లో ఉంటూ ప్రత్యర్థులకు ఉప్పందిస్తున్న కోవర్టులపై రూలింగ్ పార్టీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇందుకోసం పోలీస్, ఇంటెలిజెన్స్ టీమ్‌లను వాడుకుంటోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో వేసిన సీఐలు, ఎస్ఐలు, కింది స్థాయి పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు గ్రామాలను జల్లెడ పడ్తున్నారు. సివిల్ డ్రెస్‌లలో ఉన్న కొందరు సాధారణ ప్రజల్లాగే తిరుగుతూ ప్రజల నాడిని, నాయకులు, కోవర్టుల సమాచారాన్ని రాబట్టి, హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. ఎంత కట్టుదిట్టం చేస్తున్నా ఫోన్ల ద్వారా ప్రత్యర్థులకు సమాచారం చేరవేస్తున్నట్లు ఇంటెలిజెన్స్టీమ్లు బయటపెట్టడంతో సొంత పార్టీలోని కొందరి ఫోన్లను కూడా రూలింగ్ పార్టీ ట్యాపింగ్ చేయిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు, వారి ఫోన్లపై నిఘా పెడ్తే తప్పులేదుగానీ, సొంత పార్టీ లీడర్లపైనే నిఘా పెట్టడం ఏమిటనే చర్చ జరుగుతోంది.