అది 2017. ముగ్గురు ఇస్రో సైంటిస్టులు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఓ డ్రాప్ట్ బిల్లును చూశారు. వెంటనే ఉద్యోగాలకు టాటా చెప్పారు. సొంతగా కంపెనీ తెరిచారు. దాని పేరే ‘స్కై రూట్’. ఆ బిల్లు పేరు స్పేస్ యాక్టివిటీస్ బిల్లు. ప్రైవేటు కంపెనీలూ అంతరిక్ష కార్యకలాపాలు చేయడానికి అనుమతినిచ్చేది. స్కై రూట్ చేసే పనేంటో తెలుసా? చిన్న శాటిలైట్స్ ను అంతరిక్షానికి పంపడం. ఇందుకోసమే ‘విక్రమ్’ పేరుతో మూడు రాకెట్లు సిద్ధం చేస్తోంది. దీని మెయిన్ ఆఫీసు హైదరాబాద్ లో ఉంది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా రాకెట్లకు ‘విక్రమ్’ అని పేరు పెట్టారు . విక్రమ్ 1ను ఒక రోజులో అసెంబుల్ చేసి ప్రయోగించొచ్చు. మిగతా రెండింటికి మూడు రోజులు పడుతుంది.
మూడో వంతు ఖర్చు తగ్గుతుందట….
విక్రమ్ రాకెట్లతో చిన్న శాటిలైట్స్ ప్రయోగానికి అయ్యే ఖర్చు దాదాపుగా మూడో వంతు తగ్గుతుందని స్కై రూట్ ఫౌండర్లు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డకా, వసుదేవన్ జ్ ఞా న గాం ధీ పేర్కొన్నారు. 2021లో తొలి రాకెట్ ను నింగిలోకి పంపుతామన్నారు . రాకెట్ల ప్రయోగంలో కీలక పాత్ర పోషించే సాలిడ్ ప్రొపల్షన్, క్రయోజెనిక్ ప్రొపల్షన్ విభాగాల్లో కంపెనీకి నైపుణ్యం ఉందని చెప్పారు. చిన్న ప్రయోగాలకు సాలిడ్ ప్రొపల్షన్ చౌకైన మార్గమని, పెద్ద ప్రయోగాలకు క్రియోజెనిక్ ప్రొపల్షన్ అనువైనదని వివరించారు. ఇండియాలోప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలకు స్పేస్ విభాగంలో కార్యకలాపాలకు అనుమతి లేదు. స్పేస్ యాక్టివిటీస్ బిల్లు 2017 డ్రాఫ్ట్ ప్రకారం చూస్తే త్వరలో ఈ అవకాశం అందుబాటులోకి రావొచ్చు. ఇప్పటికే రాకెట్ ప్రయోగ వేదికల వాడకంపై డీఆర్డీవోతో స్కైరూట్ చర్చలు జరుపుతోం ది. ఇస్రో కూడా చిన్న శాటిలైట్స్ ప్రయోగాలపై స్పె షల్ ఫోకస్ పెట్టింది. వీటి కోసం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ )ని తయారు చేస్తోంది. దీన్ని రెండ్రోజుల్లోనే అసెంబుల్ చేసి, ప్రయోగించొచ్చు. అంతర్జాతీయంగా చిన్న శాటిలైట్లను నింగిలోకి పంపడానికి ఫుల్ డిమాండ్ ఉంది. వచ్చే పదేళ్లలో ఇది మరింత ఎక్కువ అవుతుందని అంచనా. అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ ‘నార్తర్న్ స్కై’ రిపోర్టు ప్రకారం.. 2027 నాటికి 6,500 చిన్న శాటిలైట్లను స్పేస్‌లోకి ప్రపంచదేశాలు పంపనున్నాయి.