కోల్‌కతా: తమ కూతురిని గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే.. డాక్టర్లు మాత్రం సూసైడ్ చేసుకున్నట్లు ఉందన్నారని మృతురాలి పేరెంట్స్ సుప్రీం కోర్టుకు వివరించారు. ఆగస్టు 9న ఉదయం 10.53 నిమిషాలకు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ నుంచి మొదటి సారి ఫోన్ వచ్చిందన్నారు. అర్ధ గంటలో మూడుసార్లు ఫోన్ రావడంతో తమ కూతురుకు ఏం జరిగిందోనని టెన్షన్ పడ్డామన్నారు. ‘మా బిడ్డకు ఏమైందో చెప్పండి ప్లీజ్’ అంటూ ఎన్నిసార్లు అడిగినా ఎవరూ చెప్పలేదని తెలిపారు.
Also Read:-సీఎం అన్నకు నోటీసులు
మూడో సారి ఫోన్ చేసినప్పుడు ‘‘మీ కూతురు సూసైడ్ చేసుకున్నట్లుంది. త్వరగా రండి’’ అని చెప్పారని తెలిపారు. హాస్పిటల్‌కు వెళ్లాక తమ కూతురి డెడ్ బాడీని చూసేందుకు మూడు గంటలు వెయిట్ చేయించారని పిటిషన్లో పేర్కొన్నారు. డాక్టర్లు, పోలీసులు ఇదంతా కావాలనే చేశారని తెలిపారు. 8వ తేదీ రాత్రి 11.30 గంటలకు తన కూతురు ఫోన్ చేసి మాట్లాడిందని, అదే చివరి కాల్ అవుతుందని అనుకోలేదని మృతురాలి తల్లి వివరించింది.
జ్వరం వచ్చింది.. జల్దీ రావాలని అన్నరు
‘‘9వ తేదీ పొద్దున 10.53 గంటలకు ఫోన్ వచ్చింది. ‘మీ బిడ్డకు జ్వరం వచ్చింది.. హెల్త్ కండీషన్ సీరియస్‌గా ఉన్నది. జల్దీ రావాలి” అని అన్నరు. ఏమైందని అడిగితే చెప్పలేదు. ఎవరు మాట్లాడుతున్నారని అడిగితే.. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని అన్నరు. వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు రావాలన్నారు. డ్యూటీలో ఉన్న నా కూతురుకు ఏమైందని అడిగినా చెప్పలేదు. మీరు వచ్చాక డాక్టర్లు చెప్తారు’’ అని చెప్పారన్నారు.
వచ్చాక మాట్లాడుదాం అన్నరు
‘‘కొద్ది సేపటికే రెండో సారి ఫోన్ వచ్చింది. అప్పటికే మేము హాస్పిటల్‌కు బయల్దేరాం. ఆర్జీ కర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నం అన్నారు. ‘మీరు వస్తున్నారు కదా?’ అని అడిగితే.. బయల్దేరామని చెప్పినం. నా బిడ్డ ఎలా ఉందని అడిగితే.. ‘ఫస్ట్ మీరు చెస్ట్ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ దగ్గరకు రండి.. వచ్చాక మాట్లాడుదాం’’ అని అన్నారు అని మృతురాలి తల్లి అన్నారు.
చివరికి చనిపోయిందని చెప్పిన్రు
‘‘దారిలోనే ఉన్నప్పుడు మళ్లీ కొద్దిసేపటికి ఫోన్ వచ్చింది. ‘నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్న.. మీ బిడ్డ ఆత్మహత్య
చేసుకుని చనిపోయినట్లుంది. పోలీసులు వచ్చారు. మీరూ వచ్చేయండి’’ అని ఫోన్ చేసి చెప్పారని మృతురాలి తండ్రి చెప్పారు.
పోస్టుమార్టం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
ఫోన్ చేసిన వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లామని, తమ కూతురికి ఏం అయ్యిందో ఎవరూ చెప్పలేదని మృతురాలి పేరెంట్స్ పిటిషన్లో పేర్కొన్నారు. తమ కూతురిని చూపించేందుకు 3 గంటలు వెయిట్ చేయించారని తెలిపారు. అయితే, ఇక్కడ పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పేరెంట్స్ వస్తే.. పది నిమిషాల్లోనే సెమినార్ హాల్‌కు తీసుకెళ్లి బాడీ చూపించామని చెప్తున్నారు.
ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఈ ఘటనపై పోలీసులకు ఎందుకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అసహజ మరణమని ఎందుకు రిజిస్టర్ చేశారని పోలీసులను ప్రశ్నించిం ది. మృతురాలి తండ్రి అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. సుమారు 11 గంటలకు పోస్టుమార్టం జరిగితే.. సుమారు 12 గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం ఏంటని మండిపడింది.
ఒంటిపై బట్టల్లేకుండే..
తన కూతురిని చూసేందుకు వెళ్లినప్పుడు ఆమె ఒంటిపై బట్టలు లేవని మృతురాలి తండ్రి చెప్పారు. కేవలం బెడ్ షీట్ కప్పి ఉందని తెలిపారు. రెండు కాళ్లు దూరంగా ఉన్నాయన్నారు. ఒక చేయి ఆమె తలపై ఉందని వివరించారు. తన కూతురిపై గ్యాంగ్ రేప్జరిగితే.. డాక్టర్లు ఆత్మహత్య
చేసుకుందని చెప్పారని మండిపడ్డారు. ఒంటి నిండా గాయాలు కనిపించలేవా? అని డాక్టర్లను ఆయన నిలదీశారు.