మోదీ, అమిత్​షాకు భయం పట్టుకుంది : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల చేత నోటీసులిప్పించి తెలంగాణ ప్రజలను ప్రధాని మోదీ, అమిత్ షా అవమానించారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మండిపడ్డారు. తుర్కపల్లి మండలం సంగ్యాతండాకు చెందిన 'లంబాడీ హక్కుల పోరాట సమితి' జిల్లా అధ్యక్షుడు భూక్యా సంతోష్​నాయక్ తో పాటు మరో 50 మంది బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

యాదగిరిగుట్టలో జరిగిన కార్యక్రమంలో వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తారని మోదీ, అమిత్ షాకు భయం పట్టుకుందన్నారు. అందుకే ఢిల్లీ పోలీసుల చేత నోటీసులు ఇప్పించారన్నారు.

కక్షపూరిత రాజకీయాలకు దిగుతున్న బీజేపీని గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.