పాత ప్రత్యర్థుల నడుమ కొత్త పోరు! .. సత్తుపల్లిలో పోటాపోటీ

  • పాత ప్రత్యర్థుల నడుమ కొత్త పోరు!
  • సత్తుపల్లిలో బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పోటాపోటీ
  • వరుసగా నాలుగో విజయంపై కన్నేసిన సండ్ర
  • గత ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని మట్టా ప్లాన్
  • ఉనికి కోసం బీజేపీ ఆరాటం

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం జిల్లా సత్తుపల్లి సెగ్మెంట్ లో పాత ప్రత్యర్థులే మరోసారి పోటీపడుతున్నారు. వరుసగా మూడుసార్లు విజయంతో హ్యాట్రిక్​ కొట్టిన సండ్ర వెంకటవీరయ్య ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. వరుసగా మూడుసార్లు ఆయన తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచారు. గతంలో సండ్ర వెంకటవీరయ్య మీద పోటీ చేసి ఓడిపోయిన మట్టా దయానంద్​ భార్య మట్టా రాగమయి ఈసారి కాంగ్రెస్​ నుంచి పోటీ చేస్తున్నారు.

బీజేపీ నుంచి మరోసారి నంబూరి రామలింగేశ్వరరావు బరిలో నిలిచినా, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ అభ్యర్థుల మధ్యే ముఖాముఖి పోరు జరిగే అవకాశముంది. సత్తుపల్లి నియోజకవర్గంలో 5 మండలాలుండగా, మొత్తం 2,38,621 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,16,968 మంది పురుషులు, 1,21,645 మంది మహిళలు, 8 మంది ట్రాన్స్​ జెండర్లున్నారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమైనా, కొత్త పంటల సాగు, ఆధునిక వ్యవసాయంపై ఇక్కడి రైతులు మొగ్గుచూపుతారు. వరితో పాటు ఆయిల్ పామ్​, మామిడి, కోకో తోటలను కూడా సాగు చేస్తారు. 

నాలుగో విజయం కోసం సండ్ర.. 

సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే వరుసగా మూడుసార్లు సత్తుపల్లి నుంచి గెలిచారు. అంతకు ముందు ఒకసారి పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సండ్ర విజయం సాధించారు. గత 3 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఆయన, గత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​ లో చేరారు. ఐదేండ్లలో నియోజకవర్గానికి వెయ్యి కోట్ల నిధులను తెచ్చానని, ఒక్క మట్టి రోడ్డు కూడా లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దానని సండ్ర చెప్తున్నారు. సీఎం కేసీఆర్​ తో డైరెక్ట్​ యాక్సెస్​ ఉన్న లీడర్​ కావడంతో ఆయా శాఖల మంత్రుల నుంచి నిధులు తెచ్చుకొని అభివృద్ధి పనులు చేయించడం సండ్రకు పాజిటివ్ గా మారింది.  రెగ్యులర్​ గా ప్రజలకు అందుబాటులో ఉండడం, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లాంటి చర్యలతో నియోజకవర్గ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యారు. కానీ వరుసగా మూడుసార్లు గెలవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది. 

మరోవైపు కాంగ్రెస్ లో ప్రస్తుతం కీలక నేతలుగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంతూళ్లు కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉండడంతో వాళ్లిద్దరి ప్రభావం సండ్ర గెలుపోటములపై ఎఫెక్ట్​ చూపే అవకాశముంది. ఇక నియోజకవర్గంలో దళితబంధు ప్రభావం కూడా సండ్రకు మైనస్​ గా మారే చాన్సుంది. ఎన్నికల షెడ్యూల్​ కు కొద్దిరోజుల ముందు నియోజకవర్గానికి మొత్తం దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని ప్రకటించినా అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చకపోవడం వంటి కారణాలతో కొంత వ్యతిరేకత వచ్చిందనే అభిప్రాయాలున్నాయి. 

వైద్యరంగం నుంచి రాగమయి..

కాంగ్రెస్ అ భ్యర్థి మట్టా రాగమయి, ఆమె భర్త మట్టా దయానంద్​ చాలా సంవత్సరాలుగా వైద్య రంగంలో ఉన్నారు. డాక్టర్లుగా భార్యాభర్తలిద్దరూ తక్కువ ఫీజుతో వైద్యం చేస్తూ సర్వీస్​ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెంట ఉన్న మట్టా దయానంద్ సత్తుపల్లిలో వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ తరఫున పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత పొంగులేటి వెంట అప్పటి టీఆర్ఎస్​ లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్​ టికెట్ వేరొకరికి ఇవ్వడంతో ఆ అభ్యర్థి విజయం కోసం పనిచేశారు. ఈ ఏడాది ప్రారంభంలో పొంగులేటితో విభేదించి ముందుగానే కాంగ్రెస్​ లో చేరారు. దీంతో పొంగులేటి సత్తుపల్లి టికెట్ కోసం కొండూరు సుధాకర్​ పేరును సూచించగా, రేణుకాచౌదరి సపోర్టుతో దయానంద్​ భార్య రాగమయికి కాంగ్రెస్​ టికెట్ దక్కింది. ఇటీవల దయానంద్​ ఎస్సీ కాదంటూ జిల్లా కలెక్టర్​ గౌతమ్​ ఆదేశాలివ్వడంతో, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం  అయిన సత్తుపల్లి నుంచి పోటీకి ఎలాంటి చిక్కులు లేకుండా ఆయన భార్య పేరుతో టికెట్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్​ లో టికెట్ ఆశించి భంగపడిన మానవతారాయ్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్​ సహా ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా ముఖ్యనేతలంతా కలిసి పనిచేస్తే, ప్రస్తుతం ఉన్న వేవ్​లో రాగమయికి గెలుపు అవకాశాలున్నాయి.

బీజేపీ నమ్మినబంటుగా నంబూరి..

ఇక బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు చాలా ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున పోటీచేసిన ఆయన, డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ పరిస్థితి బలహీనంగా ఉన్నా, జనసేన మద్దతిస్తుండడంతో ఈసారి ప్రత్యర్థులకు బలమైన పోటీ ఇవ్వాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. మరోవైపు ఏపీని ఆనుకొని ఉన్న నియోజకవర్గం కావడంతో అక్కడి రాజకీయాల ప్రభావం కూడా సత్తుపల్లిపై పడుతుంది. చంద్రబాబు అరెస్ట్ పై గతంలో కేటీఆర్​ చేసిన కామెంట్లతో బీఆర్ఎస్​ కు కొంత నెగిటివ్​ గా మారింది. సత్తుపల్లిలో ఉన్న టీడీపీ అభిమానులు ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.