న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ గొప్ప సక్సెస్ సాధించింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చి పెట్టింది. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఈ స్కీమ్ కింద 2020–21, 2023–24 మధ్య రూ.5,800 కోట్ల రాయితీలను కంపెనీలకు ఇవ్వగా, వీటి నుంచి ప్రభుత్వానికి రూ.1.10 లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇది 19 రెట్లు ఎక్కువ. ఈ నాలుగేళ్లలో రూ.12.55 లక్షల కోట్ల విలువైన ఫోన్లను కంపెనీలు పీఎల్‌ఐ కింద తయారు చేశాయి. దీనిని బట్టి రాయితీలను ఇచ్చేశాక ప్రభుత్వానికి రూ.1,04,200 కోట్ల ఆదాయం మిగిలింది.
ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఫైనాన్స్ మినిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీకి సబ్మిట్ చేసిన రిపోర్ట్‌లో ఈ వివరాలు పేర్కొంది. 2020–21, 2023–24 మధ్య మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ కాంపోనెంట్లపై రూ.48 వేల కోట్లను డ్యూటీ కింద చెల్లించింది. మరో రూ.62 వేల కోట్లు జీఎస్‌టీ రూపంలో ప్రభుత్వానికి అందాయి. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఐదు ఫారిన్, ఐదు లోకల్ కంపెనీలు పీఎల్‌ఐ కింద అర్హత సాధించాయి. మొత్తం రూ.40,951 కోట్లను ఇన్వెస్ట్ చేయడానికి మొదట వచ్చినా, తర్వాత ఈ అమౌంట్ రూ.38,601 కోట్లకు తగ్గింది. ఈ కంపెనీలకు ఏప్రిల్, 2020 లో అనుమతులు రాగా, ఇదే టైమ్‌లో స్మార్ట్‌ఫోన్లపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి ప్రభుత్వం పెంచింది.
యాపిల్ కాంట్రాక్టర్ల నుంచే ఎక్కువ..
యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లు ఫాక్స్‌కాన్, టాటా ( విస్ట్రన్), పెగట్రాన్‌ల నుంచి ప్రొడక్షన్ పెరగడంతో పాటు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. శామ్‌సంగ్ వంటి ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా పీఎల్‌ఐ కింద ఫోన్ల తయారీని పెంచాయి. ఇండియన్ కంపెనీల్లో కేవలం డిక్సన్ టెక్నాలజీస్ మాత్రమే ప్రొడక్షన్ టార్గెట్‌ను చేరుకుంటోంది. రాయితీలు పొందుతోంది. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో 2020–21 లో పీఎల్‌ఐ స్కీమ్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శామ్‌సంగ్ మినహా మిగిలిన కంపెనీలు మొదటి ఏడాది ప్రొడక్షన్ టార్గెట్‌ను చేరుకోవడంలో ఫెయిలయ్యాయి. దీంతో స్కీమ్ కాలపరిమితిని ఆరేళ్లకు పొడిగించారు. కానీ, కంపెనీలు ఏవైనా ఐదేళ్ల కాలానికే రాయితీలు పొందే అవకాశం ఇచ్చారు. శామ్‌సంగ్ మినహా మిగిలిన కంపెనీలు 2025–26 వరకు పీఎల్‌ఐ కింద రాయితీలు పొందొచ్చు. శామ్‌సంగ్‌కు 2024–25 చివరి ఏడాది. 2026–27 నాటికి రాయితీలను డిస్‌బర్స్ చేస్తారని అంచనా.
షావోమి ఫోన్లు తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ సబ్సిడరీ రైజింగ్ స్టార్ (భారత్ ఎఫ్‌ఐహెచ్) స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రొడక్షన్ టార్గెట్‌ను చేరుకోలేదు. అలానే లోకల్ కంపెనీల్లో లావా ఇంటర్నేషనల్, పడ్జెట్ (మైక్రోమ్యాక్స్), యూటీఎల్ నియోలింక్ ప్రొడక్షన్ టార్గెట్‌లను చేరుకోకపోవడంతో ప్రభుత్వ రాయితీలను అందుకోలేకపోయాయి. ఐసీఈఏ రిపోర్ట్ ప్రకారం, స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో అమలవుతున్న పీఎల్‌ఐ స్కీమ్ కింద మూడు లక్షల డైరెక్ట్ ఉద్యోగాలు, ఆరు లక్షల ఇండైరెక్ట్ ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు పెరిగారు. అలానే 2020–21, 2023–24 మధ్య రూ.2,87,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో 2018–19 లో గ్లోబల్‌గా 23 వ ర్యాంక్‌లో ఉన్న ఇండియా, ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది. ఇండియా నుంచి యూఎస్‌కు పెద్ద మొత్తంలో ఫోన్లు ఎగుమతి అవుతున్నాయి.