తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరగానే మొదటిరోజు కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు.. కీలక అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తీసుకున్న పలు నిర్ణయాలపై చర్చించారు. అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తొలి కేబినెట్ సమావేశం హాట్ హాట్ గా సాగింది. ప్రధానంగా విద్యుత్ అంశంపై సీరియస్ గా సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం చేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై రేవంత్ సీరియస్ అయ్యారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రేపటిలోగా (డిసెంబర్ 8న) పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు. మరోసారి డిసెంబర్ 8వ తేదీ ఉదయం విద్యుత్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి.. ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు.
విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నతాధికారులు వివరించారు. సీఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించ వద్దని ఆదేశించారు. రేపు (డిసెంబర్ 8న) నిర్వహించే రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.