కొందరు ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పనులు చేయకుండా.. ప్రజలకు అందుబాటులో ఉండకపోతే వాళ్లు కనిపించడం లేదని పోస్టర్లు వేసి స్థానికులు నిరసన తెలుపుతుంటారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం కూడా చూశాం. ఇక్కడ కూడా ఇంచు మించు అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ ప్రజా ప్రతినిధులు మాత్రం కాదండోయ్..!
మాయమాటలు చెప్పి..అమాయకుల దగ్గర నుంచి అందిన కాడికీ దండుకుని కుచ్చుటోపీ పెట్టిన చిట్టీల వ్యాపారి కోసం జగిత్యాల పట్టణంలో ఏకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో అదిరిపోయే ఆఫర్లు పెట్టారు బాధితులు. సదరు కంత్రీగాడి ఆచూకీ చెబితే రూ.3 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు..ఫ్లెక్సీల కింద ఫోన్ నెంబర్లను కూడా వేశారు. ఎవరికైనా చిట్టీల వ్యాపారి కనిపిస్తే వెంటనే తమకు ఫోన్ చేయాలని జగిత్యాల పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది..?
జగిత్యాల జిల్లా గోవిందుపల్లె చౌరస్తాకు చెందిన గాండ్ల వెంకన్న అనే వ్యక్తి గత కొన్నేండ్లుగా చిట్టీల వ్యాపారం చేసేశాడు. కొన్నాళ్లు ఈ వ్యాపారం బాగానే నడిపించాడు. అందరితో నమ్మకంగా మెలిగాడు. దీంతో చిట్టీల పేరుతో స్థానికుల నుంచి అందినకాడికి దండుకుని ఆ తర్వాత అక్కడి నుంచి ఉడాయించాడు. కొన్ని రోజుల నుంచి కనిపించకపోవడంతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. అయితే చిట్టీల వ్యాపారి బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.