వీళ్లు దేశముదుర్లు..ఏకంగా ట్రాఫిక్ పోలీస్ బూత్ లో మద్యం తాగారు..

ఎవరి డబ్బులతో వాళ్లు మద్యం కొని.. తాగొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ.. పబ్లిక్ ప్లేసుల్లో, అది కూడా ట్రాఫిక్ పోలీస్ బూత్ లో తాగితే పోలీసులు ఊరుకుంటారా..? ఏమో అంటారా..? మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్ లో ఇద్దరు యువకులు మద్యం తాగుతూ చాలాసేపు హల్ చల్ చేశారు. 

అందరూ చూస్తుండగానే ట్రాఫిక్ పోలీస్ బూత్ లో ఎంచక్కా కూర్చుని మందు తాగారు. తమను ఎవరూ ఆపలేరన్న దీమాతో మద్యం తాగారు. తినడానికి స్టఫ్, మద్యంలో పోసుకోవడానికి వాటర్ బాటిల్స్ తెచ్చుకుని ఎంచక్కా తాగారు. ఈ ప్రజలతో తమకెలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు.

రోడ్డుపై వెళ్లేవారు తమను చూస్తున్నారని కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. ట్రాఫిక్ పోలీస్ బూత్ లో కూర్చుని మద్యం తాగితే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం లేకుండా..కేసులు పెడుతున్నారన్న సోయి కూడా లేకుండా గంటల తరబడి కూర్చుని మద్యం తాగారు.

నిత్యం మహిళలు, ఐటీ ఉద్యోగులు తిరిగే ఈ ప్రాంతంలో పోకిరులు ఇలా దర్జాగా మందు తాగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపించాయి. పట్టపగలు బహిరంగ ప్రదేశంలో ఇలా మందు తాగుతూ.. బిర్యానీ తింటూ ఎంజాయ్ చేశారు.