ప్రభుత్వ పథకాలు అర్హులకు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేసేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆదివారం (అక్టోబర్ 8న) పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాలు డబ్బున్న వాళ్లు, బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని మహిళలు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని నిలదీశారు. కామారెడ్డి జిల్లాలో అర్హులైన అందరికీ దళితబంధు ఇవ్వాలని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ లీడర్లతో పాటు ఎమ్మెల్యే రాములు నాయక్ తమ గ్రామానికి రావొద్దంటూ కేజీ సిరిపురం దళితులు ఫ్లెక్సీలు కట్టారు. దళితబంధుతో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలోనూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఖుద్వాన్ పూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. తమ ఊరికి ఎమ్మెల్యే రావద్దని ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సోమవారం (అక్టోబర్ 9న) ఖుద్వాన్ పూర్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన ఉంది. ఈ క్రమంలోనే ఆ గ్రామంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలియడం కలకలం రేపుతోంది.