మూగబోయిన బల్దియా ‘ప్రజావాణి‘

మూగబోయిన బల్దియా ‘ప్రజావాణి‘

ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించి సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చూపాల్సిన జీహెచ్‌ఎంసీ ప్రజావాణి మూగబోతోంది. ప్రతి సోమవారం నిర్వహించాల్సిన కార్యక్రమం వరుస ఎన్నికల నేపథ్యంలో ఆగిపోయింది. చాలా గ్యాప్‌ తర్వాత జూన్​ 10 నుంచి  మూడు వారాలు విజ్ఞప్తులు స్వీకరించిన అధికారులు మళ్లీ సైలెంట్ అయ్యారు. ప్రతి వారం జ‌రిగే ప్రోగ్రాంలో అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, ఉన్నతాధికారులు హాజ‌రు కావాలని క‌మిష‌న‌ర్ దానకిశోర్​ఆదేశించిన‌ప్పటికీ ఎవరూ పాటించడం లేదు. దీంతో ప్రజావాణికి వ‌చ్చే ఫిర్యాదుదారులు నిరాశ‌కు గుర‌వుతున్నారు.

హైదరాబాద్‌, వెలుగు:ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న ప్రజావాణి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. వరుస ఎన్నికల కోడ్​తో చాలా గ్యాప్‌ తర్వాత పట్టాలెక్కిందనుకున్న ‘ప్రజావాణి’ మళ్లీ మూగబోయింది. మూడు వారాలు సంద‌డి చేసిన అధికారులు సైలెంట్ అయ్యారు. ప్రతి వారం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, ఉన్నతాధికారులు హాజ‌రు కావాలని క‌మిష‌న‌ర్ ఆదేశించిన‌ప్పటికీ వారు పాటించ‌డం లేదు. దీంతో ప్రజావాణికి వ‌చ్చే ఫిర్యాదుదారులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరాశతో  వెనుదిరుగుతున్నారు.

ఆరేళ్ల క్రితం ప్రారంభం

ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారమే ధ్యేయంగా ఆరేళ్ల క్రితం అప్పటి కమిషనర్‌ కృష్ణబాబు ప్రజావాణి ప్రారంభించారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల  నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించడం దీని ఉద్దేశం. సమావేశానికి అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరై ప్రజావాణిని విజయవంతంగా నిర్వహించాలి.  గతేడాది శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల కోడ్​ కారణంగా నెలల తరబడి  ప్రజావాణి జరగలేదు.  కోడ్​ ముగిసిన తర్వాత ప్రజావాణి జూన్‌ 10న తిరిగి ప్రారంభమైంది. మూడు వారాల పాటు సక్రమంగా జరిగిన విజ్ఞాపనల స్వీకరణ మళ్లీ మొదటికొచ్చింది. కానీ సోమవారం నిర్వహించిన ప్రజావాణి వెలవెలబోయింది.  తొలుత కమిషనర్‌ దానకిశోర్ ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించాలని భావించారు. అధికారులను కూడా అలర్ట్‌ చేశారు. కానీ చివరి నిమిషంలో అత్యవసరమై లీవ్‌ తీసుకున్నారు. కమిషనర్‌ దానకిశోర్ హాజరైనప్పుడు ప్రజావాణిలో పాల్గొనే అధికారులు సోమవారం కమిషనర్‌ రాకపోవడంతో అడిషనల్‌ కమిషనర్లు ప్రజావాణికి హాజరు కాలేదు. సుదూరప్రాంతాల నుంచి  వ్యయప్రయాసలతో బల్దియా కార్యాలయానికి వచ్చిన జనం నిరాశగా వెనుదిరిగారు.