- రూ.3.35 కోట్ల హవాలా డబ్బు సీజ్
- బంజారాహిల్స్‌లో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
- కోటికి రూ.25 వేలు కమీషన్ తీసుకుంటున్నట్టు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు హవాలా డబ్బుపై ఫోకస్ పెట్టారు. హవాలా వ్యాపారులు, ఏజెంట్ల నెట్‌వర్క్‌ను బ్రేక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బంజారాహిల్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ.3.35 కోట్ల హవాలా డబ్బును సీజ్ చేసి నలుగురు ఏజెంట్లను అరెస్టు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని చిత్తూరు జిల్లా చౌడపల్లి దేవరగుడిపల్లికి చెందిన చింపిరెడ్డి హనుమంతరెడ్డి చందానగర్‌లో ఉంటున్నాడు. కమీషన్ బేస్‌పై హవాలా డబ్బును ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన బచల ప్రభాకర్, మందల శ్రీరాములు రెడ్డి, మందల ఉదయ్‌కుమార్‌రెడ్డితో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు.
ఏడాది క్రితం బంజారాహిల్స్‌లో ఆఫీస్ ఓపెన్ చేశారు. హైదరాబాద్‌లోని వ్యాపారస్తులు, హవాలా నిర్వాహకుల వద్ద డబ్బును సేకరించి ఇతరులకు డెలివరీ చేసేవారు. రూ.కోటి హవాలా డబ్బు డెలివరీ చేసినందుకు రూ.25 వేలు కమీషన్ వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం హనుమంతరెడ్డితోపాటు ముగ్గురు వ్యక్తులు కలిసి బేగంబజార్, నాంపల్లి, గోషామహల్, జూబ్లీహిల్స్‌లో డబ్బును కలెక్ట్ చేశారు.
ఆ డబ్బును బంజారాహిల్స్‌లోని ఆఫీస్‌కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కియా కారులో పెట్టుకుని కస్టమర్లకు ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు వెళ్తుండగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు అడ్డగించి సోదాలు చేసి రూ.3.35 కోట్లు ఉన్న బ్యాగులను గుర్తించారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. డబ్బును కోర్టులో డిపాజిట్ చేసి ఐటీ అధికారులకు అప్పగిస్తామని డీసీపీ జోయల్ డెవిస్ వెల్లడించారు. .=