భద్రాచలం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 12,18 తేదీల్లో సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దున జిల్లా ఉండడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. తెలంగాణలో ఉనికిని చాటుకునేందుకు ఇప్పటికే మావోయిస్టు పార్టీ పావులు కదుపుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వారి కదలికలను ఇటీవల పోలీసులు గుర్తించారు. చర్ల మండలం కొండెవాయి ప్రాంతంలో మావోయిస్టులు పెట్టిన మందుపాతరను రెండు రోజుల క్రితమే నిర్వీర్యం చేసి మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. దీంతో సీఎం పర్యటనకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని మార్గాలపై కన్నేశారు. వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. లోకల్ పోలీసులకు తోడుగా సీఆర్పీఎఫ్ బలగాల సహకారం తీసుకుని వాహనాల తనిఖీలు చేస్తున్నారు.
దళాల కదలికలపై ఆరా..
జిల్లాలో భద్రాద్రికొత్తగూడెం-, అల్లూరి సీతారామరాజు, పాడేరు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ నేతృత్వంలో దళాలు యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. రెండు రోజల కింద భద్రాచలం సరిహద్దులోని చింతూరు మండలంలో ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత్య చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ లీడర్లను టార్గెట్ చేస్తూ ఇప్పటికే ప్రకటనలు కూడా చేశారు. దీంతో దళాల కదలికలపై పోలీస్ ఇంటిలిజన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. చర్ల, మణుగూరు, గుండాల, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడులో సమాచారం సేకరిస్తున్నారు. అనుమానితులపై నిఘా పెట్టారు. పాల్వంచ,-కొత్తగూడెం మధ్యలో కలెక్టరేట్ ఓపెనింగ్, బహిరంగ సభ ఉండడంతో ఈ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటిపై కన్నేశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.
అంతా సిద్ధం..
సీఎం పర్యటనకు పోలీసులు ఏర్పాట్లు షురూ చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రాచలానికి తెచ్చిన బారికేడ్లను మంగళవారం లారీల్లో పాల్వంచకు తీసుకెళ్లారు. ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. బహిరంగసభ వేదిక, కలెక్టరేట్ ప్రాంతంలో పార్కింగ్ కోసం స్థలాలను సేకరిస్తున్నారు. వీఐపీల వాహనాలకు, కార్యకర్తలను తరలించే వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ఏర్పాటుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ వినీత్‌తో పాటు ఓఎస్డీ, ఏఎస్పీలు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
ఏర్పాట్ల పరిశీలన..
పాల్వంచలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ఈ నెల 12న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మీటింగ్ అనంతరం కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్ బిల్డింగ్‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ముఖ్యులతో కొంత సేపు మాట్లాడి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. సీఎం పర్యటన సందర్భంగా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి పాల్వంచ వరకు బీఆర్ఎస్ జెండాలతో రోడ్లను అలంకరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెత్త తొలగిస్తున్నారు.
కలెక్టరేట్ ముస్తాబు..
కలెక్టరేట్ ఓపెనింగ్‌కు ముస్తాబవుతోంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల ఆఫీసులతో పాటు ముఖ్యమైన డిపార్ట్మెంట్ల రూమ్స్లలో ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కలెక్టరేట్లో ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్‌తో మాట్లాడారు.