- పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు సీజ్
మెహిదీపట్నం/ షాద్ నగర్/మంచాల, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. చెక్ పోస్టుల వద్ద వెహికల్స్ తనిఖీ చేసి భారీగా డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం వివిధ ప్రాంతాల్లో భారీగా డబ్బు, బంగారం పట్టుబడింది. షాహినాయత్ గంజ్ పీఎస్ ఇన్ స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో గోషామహల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బైక్‌లపై వెళ్తున్న ఆగాపురాకు చెందిన బాలాజీ నుంచి రూ.2 లక్షల 85 వేలు, సికింద్రాబాద్‌కు చెందిన నరేశ్ నుంచి రూ.6 లక్షల 95 వేలను స్వాధీనం చేసుకున్నారు.
* హమయూన్నగర్ పీఎస్ పరిధి సరోజిని దేవి కంటి ఆస్పత్రి వద్ద సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిజాముద్దీన్ అనే వ్యక్తి కారును తనిఖీ చేసిన పోలీసులు రూ.2 లక్షల 20 వేలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి నిజాముద్దీన్ ఎలాంటి పేపర్లను సమర్పించకపోవడంతో సీజ్ చేసి నాంపల్లి రిటర్నింగ్ ఆఫీసర్‌కు అప్పగించినట్లు ఇన్ స్పెక్టర్ సైదీశ్వర్ తెలిపారు.
* కుల్సుంపురా పీఎస్ ఇన్ స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో పురానాపూల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బైక్‌పై వచ్చిన ఆనంద్ అనే వ్యక్తిని అడ్డుకుని తనిఖీ చేశారు. స్కూటీ డిక్కీలో దాచిన 600 గ్రాముల బంగారు నగలను గుర్తించారు. వాటిని ఎన్నికల అధికారికి అప్పజెప్పారు.
* షాద్‌నగర్ పరిధి కొత్తూరు వై జంక్షన్ వద్ద సీఐ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేపట్టారు. షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేశారు. రూ.8 లక్షల 50 వేల 500ను
గుర్తించారు. కారులో ఉన్న మొయినాబాద్‌కు చెందిన ముకుంద్ రెడ్డి అనే వ్యక్తి ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
* రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లిలో సాగర్ హైవేపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కూకట్‌పల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డి నుంచి రూ.20 లక్షలు, లోయపల్లికి చెందిన కె. శ్రీనివాస్ నుంచి రూ.2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌కు అప్పగించినట్లు సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు.
* నారాయణగూడ వై జంక్షన్ వద్ద దోమలగూడ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో బైక్‌పై వెళ్తున్న వెంకటరమణ అనే వ్యక్తి నుంచి రూ.లక్షా 75 వేలు స్వాధీనం చేసుకున్నారు.