- 3.50 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
- రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చకచకా పనులు
- క్వార్టర్లు, డీఈ ఆఫీస్‌ను ఖాళీ చేయిస్తున్న ఆఫీసర్లు
- రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చకచకా పనులు
- క్వార్టర్లు, డీఈ ఆఫీస్‌ను ఖాళీ చేయిస్తున్న ఆఫీసర్లు
భద్రాచలం, వెలుగు : రాష్ట్రపతి భద్రాచలం టూర్ ఫిక్స్ కావడంతో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేయడంలో బిజీగా మారారు. గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఆర్అండ్బీ ఆఫీస్‌ను ఆఫీసర్లు ఖాళీ చేయిస్తున్నారు. ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అనంతరం కేంద్రం టూరిజం శాఖ నేతృత్వంలో ప్రసాద్ స్కీం ద్వారా చేపట్టే పనులకు భూమిపూజ చేస్తారు. రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్కు భద్రాచలం ఆర్అండ్బీ ఆఫీసుకు చెందిన 3.50 ఎకరాల ల్యాండ్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రూ.50 కోట్ల ప్రసాద్ ఫండ్స్ తో ఈ స్థలంలో భక్తులకు మౌలిక వసతులు కల్పించేలా డార్మెటరీ హాల్స్, మరుగుదొడ్లు, పార్కు ఇతర సదుపాయాలు కల్పించనున్నారు.
ఆర్అండ్బీ ఆఫీసర్ల తిప్పలు..
ఆర్అండ్బీ డీఈ ఆఫీసుతో పాటు క్వార్టర్లు సర్వే నెంబరు 10 లో ఉన్నాయి. 20 మంది స్టాఫ్ ఈ క్వార్టర్లలో ఉంటున్నారు. ప్రసాద్ స్కీం పనుల భూమి పూజ కోసం ఆర్అండ్బీ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర టూరిజం ఆఫీసర్లు ముందుకొచ్చారు. దీంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకుని టూరిజం శాఖకు అప్పగించాలని భద్రాచలం తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు రోజులుగా తహసీల్దార్ డీఈ ఆఫీసుతో పాటు క్వార్టర్లను ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. సోమవారం క్వార్టర్లలో ఉండే 20 మంది గ్యాంగ్‌మెన్, ఇతర సిబ్బంది బయట రూమ్స్ అద్దెకు తీసుకొని ఖాళీ చేశారు. హడావుడిగా ఆఫీసుతో పాటు క్వార్టర్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడంతో ఆర్అండ్బీ ఆఫీసర్లు తిప్పలు పడుతున్నారు. డీఈ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకపోవడం ఇబ్బందిగా ఉందని డీఈ హరిలాల్ అన్నారు.
సొంత స్థలాలు ఇతర శాఖలకు..
ఆర్అండ్బీ శాఖకు భద్రాచలం పట్టణంలో అనేక ఎకరాల్లో భూములు ఉండేవి. వాటిని ఇతర ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏడు మండలాలు ఏపీలో విలీనం కావడంతో భద్రాచలంలోని ఈఈ కార్యాలయాన్ని సత్తుపల్లికి తరలించారు. దీంతో భూములు ఖాళీగా ఉన్నాయని గుర్తించిన కలెక్టర్ కేంద్ర టూరిజం ప్రసాద్ స్కీం ద్వారా భద్రాచలంలో చేపట్టే పనుల కోసం 3.50 ఎకరాలు కేటాయించారు. ఇదిలా ఉంటే భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు కలిపి ఆర్అండ్బీ డివిజన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులు జారీ కానున్నాయి. భద్రాచలం, అశ్వాపురంలలో సబ్ డివిజన్ ఆఫీసులతో పాటు భద్రాచలంలో డివిజన్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు వివిధ శాఖలకు స్థలాలు ఇచ్చిన ఆర్అండ్బీ శాఖ అధికారులు డివిజన్ ఆఫీస్ మంజూరైతే తమ పరిస్థితి ఏమిటని అంటున్నారు.