మణిపూర్‎లో అల్లర్లు.. మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం

మణిపూర్‎లో అల్లర్లు.. మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఇంఫాల్: జాతుల మధ్య వివాదంతో మణిపూర్ రాష్ట్రం మరోసారి అల్లర్లతో అట్టుడుకుతోంది. మణిపూర్‎లో మళ్లీ అల్లర్లు చెలరేగుతోన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‏లో శాంతిభద్రతలను పునరుద్ధరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షించేందుకు అదనపు బలగాలను పంపాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. 90 కంపెనీలు లేదా దాదాపు 10,800 మంది కేంద్ర బలగాల సిబ్బందిని మణిపూర్‌లో మోహరించనుంది. 

కేంద్రం మణిపూర్‎కు 90 కంపెనీల అదనపు బలగాలను పంపుతోందని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇంఫాల్‌కు అదనపు బలగాలు చేరుకున్నాయని.. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొదట సైనికులను మోహరిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో కొత్త కోఆర్డినేషన్‌ సెల్‌లు, జాయింట్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తాం.. ఇప్పటికే పనిచేస్తున్న వాటిని సమీక్షించామని ఆయన పేర్కొన్నారు. 

మే 2023లో మైతేయి  కమ్యూనిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి పోలీసుల దగ్గర మిలిటెంట్లు దోచుకున్న సుమారు 3,000 ఆయుధాలను భద్రతా దళాలు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పిఎఫ్), ఆర్మీ, అస్సాం రైఫిల్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశాస్త్ర సీమా బల్‌తో సహా అన్ని బలగాలు మణిపూర్‎లో పని చేస్తున్నాయని వెల్లడించారు. 

మే 2023 నుంచి మణిపూర్‎లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 258 మంది చనిపోయారని తెలిపారు. నవంబర్ 7న జిరిబామ్‌లోని జైరాన్ గ్రామంలో హ్మార్ తెగకు చెందిన ఒక మహిళ, ముగ్గురు పిల్లలను మైతేయి మిలిటెంట్లు హత్య చేయడంతో మణిపూర్‎లో మరోసారి అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. దీనికి ప్రతీకారంగా నవంబర్ 11న మైతేయి వర్గంపై కుకీ తీవ్రవాదులు ఎటాక్ చేశారు. రంగంలోకి దిగిన సీఆర్ఫీఎఫ్ జవాన్లు అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. భద్రతా దళాల ఎన్ కౌంటర్లో 10 మంది మిలిటెంట్లు హతమయ్యారు.