సంవత్సరంలో.. ఒకే ఓసీలో పది మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి

  •     తవ్విన బొగ్గంతా డిస్పాచ్​చేసిన్రు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్​ఓసీ ఒక్క ఏడాదిలో పది మిలియన్​ టన్నుల బొగ్గును తవ్వి, రవాణా చేసి సింగరేణిలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. 130 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీలో కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్ ఓపెన్​ కాస్ట్​ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన పది మిలియన్​ టన్నుల బొగ్గు ప్రొడక్షన్​తో పాటు ట్రాన్స్​పోర్టు చేసింది. జేవీఆర్​ఓసీలో షవల్స్, డోజర్స్, లోడర్స్, డంపర్స్, సపోర్ట్ షవల్స్, డ్రిల్స్, గ్రేడర్స్, వాటర్​ట్యాంకర్స్​అన్ని కలిపి దాదాపు 61 వరకు ఉన్నాయి.

బొగ్గు ఉత్పత్తిలో ఈ ఓసీ మెషినరీ కీలక పాత్ర పోషిస్తోంది. జేవీఆర్​ఓసీ 2005–06 ఆర్థిక సంవత్సరంలో సత్తుపల్లిలో కొత్తగూడెం ఏరియా కింద సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసింది. మొదట్లో కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఉత్పత్తిలో రారాజుగా జేవీఆర్​ ఓసీపీ వెలుగొందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వంద లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్న క్రమంలో జూన్​ నుంచి ఆగస్టు వరకు నిరంతరంగా కురిసిన వర్షాలతో కొంత ఆటంకం కలిగింది. అయినప్పటికీ అధికారులు, కార్మికులు సమష్టిగా కృషి చేసి వంద మిలియన్​టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి సత్తా చాటారు.

కొత్తగూడెం ఏరియాలోని కిష్టారం ఓపెన్​ కాస్ట్​లో ఈ ఆర్థిక సంవత్సరం 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా నెలాఖరు నాటికి లక్ష్యాన్ని సాధించింది. గతంలో ఏరియా జీఎం పనిచేసి ప్రస్తుతం కార్పొరేట్​ ప్రాజెక్ట్​ ప్లానింగ్​లో సీజీఎంగా పనిచేస్తున్న నర్సింహారావుతో పాటు ప్రస్తుతం పని చేస్తున్న జనరల్​మేనేజర్​జక్కం రమేశ్​ప్లానింగ్​వల్లే వంద మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధ్యమైందని కార్మికులు పేర్కొంటున్నారు. 

సమష్టి కృషి ఫలితమే..

అధికారులు, ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషి ఫలితంగానే జేవీఆర్​ఓసీలో వంద మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడంతో పాటు రవాణా చేయగలిగాం. ఇదే ఏరియాలోని కిష్టారం ఓసీ ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 20 లక్షల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం అభినందనీయం. ఇదే స్ఫూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తాం. – జక్కం రమేశ్, జనరల్​మేనేజర్, కొత్తగూడెం ఏరియా

సింగరేణిలో సరికొత్త రికార్డ్​  

సింగరేణిలోనే జేవీఆర్​ఓసీ సరికొత్త రికార్డ్​సృష్టించింది. వంద మిలియన్​ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడంతో పాటు రవాణా చేయడం ఒక అద్భుతం. ఇందుకు కృషి చేసిన అధికారులు, కార్మికులకు ప్రత్యేక అభినందనలు. జేవీఆర్​ఓసీతో పాటు ఒడిశాలోని నైనీ ప్రాజెక్ట్​ నుంచి పెద్ద మొత్తంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తికి ప్లాన్​ చేస్తున్నాం. – ఎన్. బలరాం, డైరెక్టర్, సింగరేణి కాలరీస్​ కంపెనీ