వేర్వేరు కారణాలతో ఒక్కరోజే ముగ్గురు సూసైడ్

  • వేర్వేరు కారణాలతో ఒక్కరోజే ముగ్గురు సూసైడ్
  • ప్రేమించిన అమ్మాయితో పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదని యువకుడు
  • భర్త వేధింపులు తట్టుకోలేక భార్య
  • అదనపు కట్నం వేధింపులకు బలైన యువతి

శేరిలింగంపల్లి/కూకట్​పల్లి/గండిపేట, వెలుగు : ప్రేమించిన అమ్మాయితో పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదని యువకుడు, భర్త వేధింపులు తట్టుకోలేక భార్య, అదనపు కట్నం వేధింపులతో యువతి.. ఇలా గ్రేటర్ పరిధిలో వేర్వేరు కారణాలతో ఒక్కరోజే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. 

మియాపూర్​లో..

సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన మేకల సునీల్(22) సిటీకి వచ్చి మియాపూర్​లోని ఎంఏనగర్​లో ఉంటున్నాడు. స్విగ్గీ డెలివరీ బాయ్​గా పనిచేస్తున్న సునీల్ కొంతకాలంగా బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయి సైతం సునీల్​ను ప్రేమించినప్పటికీ ఆమె తల్లిదండ్రులు వీరి పెండ్లికి ఒప్పుకోలేదు. మనస్తాపానికి గురైన సునీల్ శనివారం ఉదయం తన రూమ్​లో ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలా
నికి చేరుకున్న పోలీసులు డెడ్​బాడీని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. ప్రేమించిన యువతితో పెండ్లి జరగడం లేదనే బాధతో సునీల్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

కేపీహెచ్​బీలో..

కుటుంబ సమస్యలు, భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన కేపీహెచ్​బీ పీఎస్ పరిధిలో జరిగింది. ఏపీలోని విజయవాడకు చెందిన సాత్విక(27)కు, హరీశ్​తో 2021లో పెండ్లి జరిగింది. అప్పటి నుంచి ఇద్దరూ కేపీహెచ్​బీ కాలనీలో ఉంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్​వేర్ జాబ్​ చేస్తున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. కొంతకాలంగా సాత్విక, హరీశ్​మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో హరీశ్​భార్యను తరచూ మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు తట్టుకోలేక శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్​బాడీని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.

అత్తాపూర్​లో..

అదనపు కట్నం వేధింపులు భరించలేక యువతి సూసైడ్ చేసుకున్న ఘటన అత్తాపూర్ ఔట్ పోస్ట్ పీఎస్ పరిధిలో జరిగింది. కర్నాటకలోని బీదర్​కు చెందిన నందిని(22)కి గుల్బర్గా ప్రాంతానికి చెందిన రత్నదీప్​తో మూడేండ్ల కిందట పెండ్లి జరిగింది. ఏడాదిన్నర కాలంగా వీరిద్దరూ అత్తాపూర్​లోని తేజస్వినగర్​లో ఉంటున్నారు. రత్నదీప్ ఓ హాస్పిటల్​లో ల్యాబ్ టెక్నీషియన్​గా పనిచేస్తున్నాడు. 6 నెలల నుంచి నందిని, రత్నదీప్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదనపు కట్నం తేవాలని రత్నదీప్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు భరించలేక నందిని శనివారం ఇంట్లో ఉరేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్​బాడీని ఉస్మానియాకు తరలించారు. తమ కూతురు మృతికి రత్నదీప్ కారణమని ఆరోపిస్తూ నందిని పేరెంట్స్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.