- మూడు జిల్లాల్లో.. 34 వేల ఎకరాల్లో పంట నష్టం
- ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ
- వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో నష్టంపై సీఎంకు రిపోర్ట్
- ప్రత్యామ్నాయ పంటలేసుకోవడానికి సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని ప్రతిపాదన
ఇటీవలి వర్షాలకు రాష్ట్రంలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో 34,331 ఎకరాల పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ముఖ్యంగా మక్క, పల్లి, పెసలు, జొన్నలు, మినుములు, మిర్చి, వరి, కంది పంటలు దెబ్బతిన్నాయి. మూడు జిల్లాల్లోని 402 గ్రామాల్లో 26,388 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
హైదరాబాద్/వరంగల్, వెలుగు: అకాల వర్షాలకు రాష్ట్రంలో కేవలం మూడు జిల్లాల్లోనే దాదాపు34 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ఈ నెల10వ తేదీ నుంచి15 వరకు కురిసిన వర్షాలు, వడగండ్లకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో 34,331ఎకరాల పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నివేదికను సోమవారం సీఎం కేసీఆర్‍కు అందజేసింది. మక్క, పల్లి, పెసలు, జొన్నలు, మినుములు, మిర్చి, వరి, కంది పంటలు దెబ్బతిన్నట్లు రిపోర్ట్‌లో ప్రస్తావించింది. మూడు జిల్లాల పరిధిలో 25 మండలాల్లోని 402 గ్రామాల్లో 26,388 మంది రైతులు ఎఫెక్ట్ అయినట్లు వ్యవసాయ శాఖ కేబినెట్ కు నివేదించింది. బాధిత రైతులకు పంట నష్టం తగ్గించడానికి, సబ్సిడీపై సీడ్స్ సప్లై చేయాలని ఆఫీసర్లు ప్రతిపాదించారు. 50 శాతానికి పైగా దెబ్బతిన్న మక్క, పల్లి, మిర్చి, జొన్నల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
మిర్చికి పెద్ద దెబ్బ
వడగండ్లకు ఉమ్మడి వరంగల్జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 20,533 ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. మరో 10 వేల ఎకరాల్లో మక్క దెబ్బతిన్నది. ఇంకో 4 వేల ఎకరాలు ఇతర పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ రిపోర్టులో పేర్కొంది. కాగా ఉమ్మడి వరంగల్‌జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రూ.960 కోట్ల పంట నష్టం జరిగినట్లు ఎమ్మెల్యేలు కూడా సీఎం కేసీఆర్‍కు లెటర్ రాశారు. 3 నియోజకవర్గాల్లోని19 మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‍రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నర్సంపేటలోని 6 మండలాల పరిధిలో మిరప 17,700 ఎకరాలు, మక్క 8,000, కూరగాయలు 176, అరటి 137, మిగతా 374 ఎకరాల్లో ఇతర పంటల్లో మొత్తంగా 100 శాతం నష్టం జరిగినట్లు చెప్పారు. పరకాల పరిధిలోని 6 మండలాల్లో మిరప 10 వేల ఎకరాలు, మొక్కజొన్న 7,000, అరటి 21, కూరగాయలు 546, ఇతర పంటలు 46 ఎకరాల్లో వంద శాతం నేలమట్టమైనట్లు తెలిపారు. భూపాలపల్లి 7 మండలాల పరిధిలో మిరప 7,000 ఎకరాలు, మొక్కజొన్న 500 ఎకరాల పంట 100 శాతం నష్టమైనట్లు పేర్కొన్నారు. మొత్తంగా మూడు నియోజకవర్గాల్లో మిరప 34,700 ఎకరాలు, మక్క15,500, అరటి 170, కూరగాయలు 700, కంది, శనగ, మినుములు, పెసర వంటివి 800 ఎకరాల్లో పూర్తి నష్టం జరిగినట్లు లెటర్ ఇచ్చారు. ఒక్కో మిర్చి రైతు ఎకరానికి రూ.3,75,000 చొప్పున నష్టపోయినట్లు వెల్లడించారు.
నాలుగేండ్లలో 25 లక్షల ఎకరాలు
నాలుగేండ్లలో దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2020లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 14.93 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇది కాగితాలకే పరిమితమైంది. నిరుడు పంట నష్టం వాటిల్లినా.. ప్రాథమిక అంచనాలు వేయొద్దని సర్కారు నుంచి ఆదేశాలు వెళ్లడంతో పంట నష్టం నమోదు చేయలేదు. 2016, 2017, 2019, 2020 సంవత్సరాల్లో పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించినా.. పక్కన పెట్టేశారు. పంటల బీమా పేరుతో ఇన్‌పుట్ సబ్సిడీని పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు రెండేళ్లుగా రాష్ట్రంలో పంట బీమా కూడా అమలు కావడం లేదు.
గతంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇలా
2009 నుంచి 2014 దాకా ప్రకృతి విపత్తుల వల్ల 14 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.518 కోట్లు ఇచ్చాయి. 2014లో 70,156 ఎకరాల్లో పంటలు నష్టపోతే రూ.80.61 కోట్లు చెల్లించారు. 2015లో తుఫాన్ ప్రభావం, కరువుతో 13.53 లక్షల ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. ఇందుకోసం రూ.703 కోట్లు ఇచ్చారు. 2016, 2017లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని సర్కారు.. 2018లో 70 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే రూ.22 కోట్లు మాత్రమే చెల్లించింది. తర్వాత 2019, 2020, 2021లో పైసా ఇయ్యలేదు. అకాల వర్షాలు, వడగండ్లకు పంట నష్టంపై ఎప్పటికప్పుడు కేంద్రం రాష్ట్రాన్ని నివేదికలు కోరుతూ వస్తోంది. అయితే రాష్ట్ర సర్కారు నుంచి వాటికి ఎలాంటి రిప్లై వెళ్లలేదు.
33 శాతం పైన దెబ్బతింటే..
వానలు, వడగండ్లు, వరదల వల్ల పంటలు నష్టపోతే వ్యవసాయ శాఖ ప్రిలిమినరీ డ్యామేజ్ ను అంచనా వేస్తుంది. తర్వాత సర్కార్ అనుమతితో సమగ్ర పంట నష్టం వివరాలను సేకరిస్తుంది. దానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎస్డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా పంట 33 శాతం పైగా దెబ్బతింటే ఎకరాకు ఇంత అని లెక్కగట్టి పరిహారం ఇవ్వాలి. ఆ ప్రకారం ఎకరా వరికి ఇన్ పుట్ సబ్సీడీ రూ.5,463, పత్తి, కంది, సోయాబీన్, పెసర, జొన్న, పల్లికి ఎకరాకు రూ.2,751 చొప్పున, మక్కకు రూ.3,372 చెల్లించాలి. 2020లో 14.93 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా.. రూ.7 వేల కోట్ల పంట నష్టం అయినట్లు అధికారులు రిపోర్టు రూపొందించారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలంటూ సర్కారుకు అప్పటి వ్యవసాయ కమిషనర్ జనార్దన్ రెడ్డి లెటర్ కూడా రాశారు. కానీ ప్రభుత్వం అందుకు అనుమతించలేదు.
3 జిల్లాల్లో నష్టం అంచనా..
జిల్లా పంటనష్టం(ఎకరాల్లో)
వరంగల్ 24,881
హనుమకొండ 8,648
మహబూబాబాద్ 783