అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలె

డబ్బు, అధికారం, కులం, మతం అన్ని రంగాల్లో పెత్తనం చెలాయిస్తున్న నేటి పరిస్థితుల్లో అంబేద్కర్​ ఆశయాలను మరింత నిబద్ధతతో అమలు చేయాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. పార్టీలు పేద, బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే గుర్తిస్తున్న నేపథ్యంలో బాబాసాహెబ్​ సిద్ధాంతాలను, ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు కావొస్తున్నా.. నేటికీ సామాజిక అసమానతలు పోలేదు. దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారిని ఆలయాల్లోకి అనుమతించని ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఆయా ప్రభుత్వాల్లో కీలక పదవులు, ఉద్యోగాల్లో కూడా ఇప్పటికీ వివక్ష కొనసాగుతుండటం దుర్మార్గకరం. కుల నిర్మూలన జరగాలని అంబేద్కర్ కోరుకుంటే అందుకు వ్యతిరేకంగా కుల సంఘాలు పెరిగి బహుజనుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా అధికారం కోసం కుల వ్యవస్థను పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అంబేద్కర్​ ఆశయాలను మరింత నిబద్ధతతో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  వేల ఏండ్ల నుంచి విద్యకు దూరమైన బహుజన ప్రజలకు, మహిళలకు ఓటు హక్కు లేని ఆ కాలంలో దేశంలో ప్రతి మనిషికి ఒకటే విలువ ఉండాలని, అందరికీ ఓటు హక్కు కల్పించాలని(వన్ మాన్ వన్ వాల్యూ) బ్రిటీష్ వారితో పోరాడి అందరికీ ఓటు హక్కు కల్పించిన ఆయన అందరివాడు. యుద్ధాల్లో నెత్తురు పారించి సాధించే విజయానికన్నా ఎలాంటి నష్టం లేకుండా ఓటుతో ఎక్కువ విజయాలను సాధించవచ్చని, తరతరాలుగా అణచివేతకు గురైన బహుజన వర్గాల విముక్తి ఓటు హక్కుతోనే సాధ్యమని తెలియజెప్పిన అంబేద్కర్ ఆలోచనే నేడు ఆయా వర్గాల వారిని తలెత్తుకొని జీవించేలా చేసింది. ఆధిపత్య కులాలు, పాలకవర్గ నాయకులు ఇప్పుడు దళితులు, బహుజనుల వద్దకు వెళుతున్నారంటే అందుకు కారణం వారికి ఓటు హక్కు రావడమే. అందరికీ ఓటు హక్కు కల్పించి, ప్రతి మనిషికీ సమాన విలువ కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కే దక్కుతుంది.

రాజ్యాధికారమే మాస్టర్ కీ

విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థల్లో అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు దళిత, బహుజనులు, అణగారిన వర్గాల అభివృద్ధికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ లాంటి ఎన్నో రక్షణ చట్టాలు రాజ్యాంగంలో పొందుపర్చారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అణగారిన వర్గాలకు అధికారం చేరువై అభివృద్ధి జరుగుతుందని ఆర్టికల్ 3 ను కూడా పొందుపరిచారు. వేల ఏండ్ల నుంచి అణచివేతకు గురైన ప్రజలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు అమలు చేసే రాజ్యాధికారం దళిత బహుజన వర్గాలకు ఉండాలని ఆయన కోరుకున్నారు. అందుకోసమే ఓటు హక్కు కల్పించారు. ఓటు అనే ఆయుధంతో బహుజన ప్రజలు రాజ్యాధికారంలోకి రావాన్నారు. రాజ్యాధికారమే మాస్టర్ కీ అని అంబేద్కర్ పిలుపునిస్తే దాన్ని నేటి తరం కొందరు బహుజన ప్రజలు ఆధిపత్య వర్గాల పాలకులకు అప్పజెప్పు తుండటం బాధాకరం. 

సమాజంలో మార్పు రావాలె..

పూలే ఉద్యమాన్ని అధ్యయనం చేసిన అంబేద్కర్ ఆయననే తన గురువుగా ప్రకటించుకొని పెరియార్, సాహుమహారాజ్, గాడ్గే బాబా లాంటి వాళ్ల ఉద్యమ సహచర్యంతో ఉద్యమాలు చేసి, ఎన్నో హక్కులు సాధించి పెడితే నేటి సమాజం ఏమి చేస్తున్నట్లు? ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోనే. ఎక్కడైనా యుద్ధాల కన్నా ఎక్కువ విధ్వంసం జరిగిందంటే అది మత కలహాల వల్లనేనని అధ్యయనం చేసిన అంబేద్కర్ కుల మతాలు లేని మానవీయ సమాజ నిర్మాణం కోసం బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. మనుధర్మమనే అశాస్త్రీయ, అసమానతల జీవన విధానం ద్వారానే దేశ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని అధ్యయనం చేసిన అంబేద్కర్1927 డిసెంబర్ 25 న మనుధర్మ శాస్త్ర ప్రతులను బహిరంగంగా తగులబెట్టి శాస్త్రీయంగా జీవించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నో యుద్ధాలు చేసి, రక్తపాతానికి కారణమైన అశోక చక్రవర్తి బౌద్ధం ద్వారా అహింసా మార్గంలో నడవాలని జ్ఞానోదయం చెంది బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజైన అక్టోబర్14 న నాగపూర్ లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. ఈ చరిత్ర అంతా చాలామందికి తెలిసిందే. అయితే ఇక్కడ బహుజనులు గమనించాల్సింది ఏంటంటే అంబేద్కర్ ఏమి కోరుకున్నారు?, మన సమాజం ఎటువైపు నడవాలనుకున్నారు?, బహుజన వర్గాలు ఎలాంటి జీవనాన్ని సాగించాలని పిలుపునిచ్చారో ప్రజలు ఆలోచన  చేయాలి.

ఆయన మార్గంలో నడుస్తున్నామా?

అంబేద్కర్ వాదులమని, అంబేద్కర్, పూలే పేరున సంఘాలు పెట్టుకున్న వారిలో ఎంతమంది ఆ మహనీయులు చూపిన జీవన మార్గంలో కొనసాగుతున్నారో పరిశీలించుకోవాలి. కుల, మనువాద సంకెళ్ల నుంచి, బ్రాహ్మణీయ భావజాలం నుంచి బయటపడి శాస్త్రీయ జీవన విధానం కొనసాగించనంత కాలం దళిత బహుజన ప్రజలకు విముక్తి సాధ్యం కాదు. 

రిజర్వేషన్ల కల్పనతో..

రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్లు నిజమైన అంబేద్కర్ వాదులుగా మారి ‘పే బ్యాక్ టు సొసైటీ’కి అంకితమైతే ఆ ప్రయోజనాలు, అబివృద్ధి అందనంత ఎత్తుకు ఎదిగే అవకాశముంది.  దేశ సంపదను అందరూ సమానంగా పొందే రాజ్య నిర్మాణం జరగాలని కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 

మహిళల పక్షపాతి

దేశంలో సగ భాగమైన మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ చట్ట సభల్లో స్త్రీలకు రిజర్వేషన్లు కావాలని హిందూ కోడ్ బిల్లు పెడితే అప్పటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అందుకు నిరసనగా ఆయన తన మంత్రి పదవికే రాజీనామా చేసి మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. అటవీ ప్రాంతాలకు పరిమితమైన ఆదివాసీ ప్రజల హక్కులను కాపాడటం కోసం అమాయకులైన వారి ప్రాంతాల్లో ఆదివాసేతరులు చొరబడకూడదని రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ద్వారా వారికి రక్షణ కల్పించారు. దళితుల కోసం, బీసీల కోసం, మహిళల హక్కుల కోసం, ఆదివాసీల హక్కుల కోసం, అందరికి ఓటు హక్కు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు, ఇలా అన్ని వర్గాల కోసం పోరాడి ఎన్నో హక్కులు సాధించిన అంబేద్కర్​ అంటే అందరి వాడని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఐక్యతగా ముందుకెళ్లి విముక్తి కోసం పోరాడాలి.
‌‌- సాయిని నరేందర్ సోషల్​ ఎనలిస్ట్