బెంగళూరు: అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానం(స్పేస్ డాకింగ్) దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కసరత్తు కొనసాగుతోంది. స్పేస్ డాకింగ్ ఎక్స్ పరిమెంట్ (స్పేడెక్స్) మిషన్ లో భాగంగా పోయిన నెలలో అంతరిక్షానికి రెండు శాటిలైట్లను పంపిన ఇస్రో.. ప్రస్తుతం వాటిని ఒకదానికొకటిని దగ్గరకు, దూరంగా జరుపుతూ డాకింగ్ దిశగా సన్నాహాలు చేస్తోంది. తాజాగా రెండు స్పేడెక్స్ శాటిలైట్ల డాకింగ్ కు ట్రయల్ లో భాగంగా మూడు మీటర్ల దగ్గరకు వచ్చేలా చేశామని ఇస్రో ఆదివారం ప్రకటించింది. దీనిని స్పేస్ లో రెండు శాటిలైట్ల ‘హ్యాండ్ షేక్’గా అభివర్ణించింది. ‘‘ట్రయల్ లో భాగంగా రెండు శాటిలైట్లు ముందుగా 15 మీటర్లకు, అనంతరం 3 మీటర్ల సమీపంలోకి వచ్చేలా చూశాం.
ప్రస్తుతం అవి రెండూ మళ్లీ దూరంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత మళ్లీ సెకనుకు10 మిల్లీమీటర్ల వేగంతో ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి” అని ఇస్రో తెలిపింది. శాటిలైట్లను తగినంత సేఫ్ డిస్టెన్స్ లో ఉండేలా కంట్రోల్ చేస్తున్నామని, ఈ ట్రయల్ డేటాను విశ్లేషించిన తర్వాత డాకింగ్ దిశగా తదుపరి ప్రక్రియ చేపడతామని వెల్లడించింది. కాగా, స్వదేశీ టెక్నాలజీతో తొలిసారి స్పేస్ డాకింగ్ కోసం ఇస్రో భారతీయ డాకింగ్ సిస్టమ్ ను ఈ మిషన్ లో పరీక్షిస్తోంది.
ఇందుకోసం డిసెంబర్ 30న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీసీ60 రాకెట్ ద్వారా స్పేడెక్స్ 1 (ఛేజర్), స్పేడెక్స్ 2 (టార్గెట్) ఉపగ్రహాలను ప్రయోగించింది. ప్రస్తుతం భూమి చుట్టూ 475 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న ఈ ఉపగ్రహాల అనుసంధానం సక్సెస్ అయితే.. అమెరికా, చైనా, రష్యా తర్వాత స్పేస్ డాకింగ్ లో సత్తా చాటిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.