
- అమేథీలో స్మృతి ఇరానీ ఓటమి
లక్నో:ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అత్యధిక స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీకి ఇక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కేంద్రమంత్రులు ఓటమి పాల య్యారు. కీలక నియోజకవర్గమైన అమేథీలో పోటీ చేసిన స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఖేరీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న కేంద్ర హోంశాఖ సహా యమంత్రి అజయ్ మిశ్రా తేని పరాజయం చెందారు. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన ఉత్కర్ష్ వర్మ గెలుపొందారు.
మోహన్లాల్ గంజ్లో కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిశోర్ ఓటమి పాలయ్యారు. ఈయన ఎస్పీకి చెందిన ఆర్కే చౌదరి చేతిలో ఓడిపోయారు. చందౌలీలో కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండే.. ఎస్పీ అభ్యర్థి బీరేంద్ర సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఫతేపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి నరేశ్ ఉత్తమ్ పటేల్ చేతిలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఓడిపోయారు. జాలౌన్ నుంచి బరిలో నిలిచిన కేంద్రమంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మ కూడా ఓటమి పాలయ్యారు. ఎస్పీకి చెందిన నారాయణ్ దాస్ అహిర్వార్ ఇక్కడ గెలుపొందారు.