భార్యను కత్తితో పొడిచి చంపేసి తల్లికి వీడియో కాల్

ఒంటారియో: కెనడాలో ఓ పంజాబీ తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన భార్యను శాశ్వత నిద్రలోకి పంపించానని తల్లికి వీడియో కాల్ చేసి చెప్పాడు. శుక్రవారం రాత్రి అబోట్స్ ఫోర్డ్ లో ఈ ఘటన జరిగింది.  బల్వీందర్ కౌర్ (41), జగ్​ప్రీత్ సింగ్(50)  పంజాబ్​కు చెందిన వారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు హర్నూర్‌‌‌‌ప్రీత్ కౌర్ (22), కొడుకు గుర్నూర్ సింగ్ (18) ఉన్నారు. బల్వీందర్ కొంత అప్పు చేసి కూతురు హర్నూర్ ప్రీత్ ను నాలుగేండ్ల క్రితం చదువుకోవడానికి  కెనడాకు పంపించింది. ఆ దేశానికి వెళ్లిన తర్వాత హర్నూర్ కు ఆరోగ్య  సమస్యలు మొదలయ్యాయి. దీంతో బల్వీందర్ 2022లో కెనడాకు  వెళ్లింది. అప్పటి నుంచి జగ్ ప్రీత్ తనను కెనడాకు తీసుకెళ్లాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. భర్త నిరుద్యోగిగా ఉండటంతో వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే  వారం రోజుల క్రితం కెనడాకు చేరుకున్న జగ్ ప్రీత్ కత్తితో పొడిచి భార్యను చంపేశాడు. పోలీసులు జగ్​ప్రీత్​ సింగ్​ను అదుపులోకి తీసుకున్నారు.