విజయవాడ : రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్. ఇండియా క్రికెట్‌లో ఇద్దరు గ్రేటెస్ట్ ప్లేయర్లు. స్కోరుబోర్డులో ఈ ఇద్దరి పేర్లు కనిపించి దాదాపు దశాబ్దం అవుతోంది. అయితే విజయవాడలో మంగళవారం మొదలైన విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్16 నేషనల్ బాయ్స్ టోర్నీలో ద్రవిడ్, సెహ్వాగ్ అనే పేర్లు వేర్వేరు జట్లలో ప్రముఖంగా కనిపించాయి.
ఢిల్లీ, కర్నాటక మధ్య జరుగుతున్న మూడ్రోజుల మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్ వారసులు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. రాహుల్ చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ కర్నాటక అండర్16 టీమ్ కెప్టెన్‌గా ఉండగా.. తండ్రి మాదిరిగానే సెహ్వాగ్ పెద్ద కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే తొలి రోజు ఆటలో ముగిసే సమయానికి ఈ ఇద్దరికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి.
జూనియర్ ద్రవిడ్ డకౌట్ అవ్వగా.. జూనియర్ సెహ్వాగ్ ఫిఫ్టీతో నాకౌట్‌గా నిలిచాడు. జూనియర్ ద్రవిడ్ వర్సెస్ సెహ్వాగ్ కాంటెస్ట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన కర్నాటక 56.3 ఓవర్లలో 144 రన్స్‌కే ఆలౌటైంది. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అన్వయ్ (0) రెండో బాల్‌కే బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఢిల్లీ 30 ఓవర్లలో 107/1తో రోజు ముగించింది.
ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్ 98 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఆర్యవీర్ స్టాన్స్, షాట్లు అచ్చం అతని తండ్రిని తలపిస్తున్నాయి. తన ఏడు ఫోర్లలో ఆరు ఆఫ్ సైడ్‌లోనే కొట్టడం గమనార్హం.