పాలనలో కౌన్సిల్​ కీలకపాత్ర

పాలనలో కౌన్సిల్​ కీలకపాత్ర

తాజాగా  తెలంగాణ  రాష్టంలో  ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో  రాష్ట్ర  ప్రజల చూపు శాసన మండలి వైపే ఉంది.  రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తున్నది. తెలంగాణ శాసన మండలి మేధావుల వేదికగా నిలుస్తోంది. మేధావుల సభ అని, పెద్దల సభ అని  మండలి జనబాహుళ్యంలో ప్రాచుర్యం  పొందింది. శాసన మండలిని  రాజ్య సభతో  పోల్చవచ్చు.  

కేంద్రంలో  రాజ్యసభ ఏ విధంగానైతే  రాష్ట్రాలకు  ప్రాతినిధ్యం వహిస్తుందో.. అలాగే రాష్ట్రాల్లో శాసన మండలి స్థానిక స్వపరిపాలన  సంస్థలకు ప్రాతి నిధ్యం వహి స్తోంది. రాజ్యసభ  చైర్మన్  ఉప రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. కానీ,  శాసన మండలి  చైర్మన్ వేరే  పదవి నిర్వహించే అవకాశమే లేదు.  రాష్ట్రపతి ఎన్ని కల్లో మండలి సభ్యులు ఓటింగ్​లో పాల్గొనే అవకాశం లేదు.  శాసన మండలికి పరిమితులు ఉన్నప్పటికీ శాసనాల అమలులో కీలక పాత్ర పోషిస్తోంది. 

తెలంగాణ శాసన మండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) రాష్ట్ర శాసనసభ వ్యవస్థలో ఎగువ సభగా ఉంది. ప్రతి రెండేళ్లకు  ఒకసారి సభ్యులలో  మూడోవంతు పదవీ కాలం ముగియడంతో,  కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది.  నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై సభ్యుల ఎన్నిక ఉంటుంది.  ప్రతి సభ్యుడి పదవీకాలం ఆరు సంవత్సరాలు.  మండలిని శాశ్వతంగా రద్దు చేయవచ్చు అని రాజ్యాంగంలో  పేర్కొనడం జరిగింది.  

ఆంధ్రప్రదేశ్​లో 1958లో శాసన మండలి వ్యవస్థ పురుడు పోసుకుంది. 1985లో  ఈ మండలి రద్దు అయ్యింది. తిరిగి 2007లో శాసన మండలిని పునరుద్ధరించారు. 1985లో రద్దు అయినప్పుడు.. 2007వ సంవత్సరంలో  పునరుద్ధరించినప్పుడు పార్లమెంట్​లో తీర్మానం ప్రవేశ పెట్టినది అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి  భరద్వాజ్ ఒక్కరే కావడం గమనార్హం.  2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.  దీంతో  తెలంగాణ రాష్ట్రంలో  సొంత శాసన మండలి ఏర్పాటుకు  బాటలుపడ్డాయి.

చట్టసభ వ్యవస్థను ‘మండలి’ బలోపేతం చేస్తుంది

శాసన మండలి వ్యవస్థకు ఘనమైన చరిత్రే ఉంది.  శాసన మండలి ముఖ్యంగా శాసన సభలో  ఆమోదించిన బిల్లులను సమీక్షించడం, చర్చించడం ద్వారా చట్టాల తయారీలో  సహాయపడుతోంది. ఇది చట్టాలపై  సవరణలు సూచించడం,  ప్రభుత్వ విధానాలను సమీక్షించడం వంటి కీలక అంశాలను నిర్వహిస్తుంటోంది.

  మొత్తంమీద  శాసన మండలి  రాష్ట్ర శాసన వ్యవస్థలో  సమతుల్యతను కాపాడేందుకు,  చట్టాల సమగ్ర సమీక్షకు చక్కగా ఉపయోగపడుతుందని  అనడంలో ఎలాంటి సందేహం లేదు.  తెలంగాణలో శాసన మండలి ఏర్పాటు రాష్ట్ర చట్టసభ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.

మండలిలో వివిధ రంగాలకు ప్రాతినిధ్యం

శాసన మండలిని ఏర్పాటు చేయడానికి భారత రాజ్యాంగంలోని 169వ అధికరణం మేరకు రాష్ట్రాలు తమ శాసన సభలో తీర్మానం చేసి, పార్లమెంట్​ ఆమోదం పొందాలి. శాసన మండలిని కౌన్సిల్​ ఆఫ్​ స్టేట్స్​ లేదా లెజెస్లేటివ్​ కౌన్సిల్​  అని కూడా పిలుస్తారు. మొదట 1950లో బిహార్, బొంబాయి, మద్రాస్,  పంజాబ్,  ఉత్తరప్రదేశ్,  వెస్ట్ బెంగాల్  రాష్ట్రాల్లో శాసన మండలిలు ఏర్పాటయ్యాయి. 

కళలు, సాహిత్యం, సైన్స్, విభిన్న రంగాలలో ఉన్న  నిపుణులు, రచయితలను  గవర్నర్ నామినేట్ చేయడం ద్వారా శాసన విధానాల్లో చురుకైన  పాత్ర పోషిస్తారు.  శాసన మండలి  ప్రజా ప్రయోజనాలను  సమర్థంగా  కాపాడుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.   

ఎమ్మెల్సీతో ముఖ్యమంత్రి పదవి

నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990లో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఆయన ఎమ్మెల్యేగా  కాకుండా,  ఎమ్మెల్సీగా ఉండగానే  ముఖ్య మంత్రిగా  నియమితులయ్యారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ నేత 1992 వరకు  ముఖ్యమంత్రిగా పని చేశారు.  కొణిజేటి  రోశయ్య కూడా ఎమ్మెల్సీగా ఉండగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 

కొణిజేటి రోశయ్య  ఆర్థిక మంత్రిగా, పలు కీలక శాఖల్లో మంత్రిగా పనిచేశారు. 2009లో  వై.ఎస్. రాజశేఖర్​రెడ్డి  హఠాన్మరణం తర్వాత,  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా రోశయ్యను నియమించింది.  సి. రాజగోపాలాచారి (రాజాజీ) నిజానికి మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం తమిళనాడు) ముఖ్యమంత్రిగా పనిచేశారు.  మద్రాసు  రాష్ట్ర  ముఖ్యమంత్రి (1952-–1954)  స్వాతంత్ర్య భారతదేశంలో ఎమ్మెల్సీగా ఉండగానే  సీఎంగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం1953లో  మద్రాసు నుంచి వేరుగా ఏర్పడింది. అప్పటికి ఆయన తమిళనాడు రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.

దేశంలో 6 రాష్ట్రాల్లో శాసనమండలి

 ప్రస్తుత భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉంది. ఉత్తరప్రదేశ్ (100),  బిహార్ (75),  కర్నాటక (75),  మహారాష్ట్ర (78),  ఆంధ్రప్రదేశ్ (58),  తెలంగాణ (40) రాష్ట్రాలకు శాసన మండలి ఉంది. శాసన మండలి సభ్యులు  ప్రజలచే  పరోక్షంగా ఎన్నికవుతారు.  ఈ సభలోని  సభ్యులను  ఎన్నికైన  స్థానిక సంస్థలు, అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎన్నుకుంటారు. 

ఎన్టీఆర్ హయాంలో శాసన మండలి రద్దు

1958 జులై 1న ఆంధ్రప్రదేశ్  శాసన మండలి  ఏర్పాటైంది.  శాసన మండలి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా  రాష్ట్రంపై  ఆర్థికభారం పడుతోందని పేర్కొంటూ మే 31, 1985న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  సీఎం ఎన్టీ రామారావు  కౌన్సిల్​ను రద్దు చేశారు.  అప్పట్లో  మండలి రద్దు ప్రక్రియ  కేవలం  మూడు  నెలల  వ్యవధిలో  పూర్తయింది. 

1985  మార్చిలో  రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన ఎన్టీఆర్ అదే నెల 23న మండలిని రద్దు చేయాల్సిందిగా  అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి  పంపగా.. అదే  ఏడాది మే 31న  మండలిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.  దీంతో జూన్ 1, 1985న మండలి మొదటిసారిగా రద్దయిపోయింది.  

తిరిగి మళ్లీ  కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి  చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు తిరిగి మళ్ళీ శాసనమండలిని ప్రవేశపెట్టాలని శాసనసభలో బిల్లు చేశారు. కానీ, అది పట్టాలెక్కలేదు. 2004లో  వైఎస్  రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రి అయినప్పుడు తిరిగి  శాసన మండలిని ఏర్పాటు చేశారు.  దాదాపు 22 ఏళ్ల తర్వాత  మార్చి 30,  2007న  తిరిగి  మండలి  పునరుద్ధరణ జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్  విడిపోయినా,  రెండు  తెలుగు రాష్ట్రాల్లోనూ  శాసన మండలి కొనసాగుతోంది. 

మేధావుల వేదిక శాసన మండలి 

తెలంగాణ శాసన మండలిలో  మొత్తం 40 మంది సభ్యులు ఉంటారు.  స్థానిక సంస్థల నియోజక వర్గాల నుంచి 14 మంది సభ్యులు ఎన్నికవుతారు.  పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ముగ్గురు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి ముగ్గురు,  ఎమ్మెల్యేల ద్వారా 14 మంది సభ్యులు ఎన్నికవుతారు.  ఆరు మంది సభ్యులను గవర్నర్  నామినేట్  చేస్తారు. 

తొలి  తెలంగాణ  శాసన మండలి  చైర్మన్ గా  స్వామి గౌడ్ వ్యవహరించగా.. ప్రస్తుతం గుత్తా సుఖేందర్ రెడ్డి  చైర్మన్ గా కొనసాగుతున్నారు.  తెలంగాణ  రాష్ట్రంలో  మూ డు  ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు  జరుగుతున్నాయి.  రెండు టీచర్స్​ఎమ్మెల్సీలు  స్థానాలు,  ఒక  గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ  స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.

మేధావులు,  ఉన్నత  విద్యావంతులు,  టీచర్లు,  ప్రభుత్వ,  ప్రైవేటు ఉద్యోగులు  ఓట్లు  వేయనున్నారు. మొత్తానికి శాసన మండలి  మేధావులకు వేదికగా నిలుస్తు న్నది.  మండలికి ఎన్నికైన సభ్యులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ‘పెద్దల సభ’ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తారని ఆశిద్దాం. 

- జి. లక్ష్మణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్,సమాచార, పౌర సంబధాల శాఖ,కరీంనగర్