- గంజాయి, మద్యం మత్తులో జోగుతున్న గ్యాంగులు
- బస్టాండ్లు, రైల్వే స్టేషన్లే కేంద్రాలు
- కత్తులతో సహవాసం..విచక్షణ మరిచి దాడులు
- భయాందోళనలో జనాలు
హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరుగుతున్నాయి. సిటీలో గంజాయి, మద్యానికి బానిసలుగా మారి రౌడీలు, గూండాల్లా ప్రవర్తిస్తున్నారు. కత్తులు మెయింటేన్ చేస్తూ హత్యలు, దాడులకు పాల్పడుతూ జనాలను భయపెడుతున్నారు. తాజాగా వరంగల్ బస్టాండ్ సమీపంలో రాకేశ్ అనే యువకుడిపై దాడి జరిగింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో వరంగల్ నగరంలో నేరాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మొన్నటివరకు ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు క్షేత్రస్థాయి పరిస్థితులను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కత్తులు తిప్పుతున్నరు
కొంతకాలంగా వరంగల్ సిటీలో కత్తుల కల్చర్ పెరుగుతోంది. నేర చరిత్ర ఉన్న కొంతమంది తమ వెంట కత్తులు ఉంచుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట డబ్బుల విషయంలో గొడవతో వరంగల్ రైల్వే స్టేషన్‌సమీపంలో శివనగర్ కు చెందిన నజీర్ అనే రౌడీ షీటర్ పై ఉత్తర ప్రదేశ్ నుంచి వలసవచ్చిన కొందరు మద్యం మత్తులో కత్తులతో దాడి చేసి చంపేశారు. అనంతరం ట్రైన్ఎక్కి యూపీకి పరారయ్యారు.
అంతకు నాలుగు రోజుల ముందు ఓ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ను కుటుంబ తగాదాల నేపథ్యంలో కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు. నవంబర్18న వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సమీపంలో శివనగర్ కు చెందిన చందు అనే యువకుడిపై తేజ అనే మరో యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో అతడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన అనంతరం ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి హనుమకొండలో బహిరంగంగానే కత్తి తిప్పుతూ హల్చల్ చేయగా.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అంతకుముందు కాశీబుగ్గ ప్రాంతంలో చికెన్ ఉద్దెర ఇవ్వలేదని ఓ వ్యక్తి బైక్‌పై కత్తి గుచ్చి షాప్ ఓనర్‌కు వార్నింగ్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ధర్మసాగర్ మండల కేంద్రంలో అక్టోబర్ 25న అర్ధరాత్రి దాదాపు 50 మంది యువకులు గంజాయి మత్తులో నడిరోడ్డుపై కత్తులతో హల్చల్ చేశారు. మత్తులో గొడవ పడుతూ ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. జనాలను భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోలేదు.
లైట్ తీసుకుంటున్న పోలీసులు
రౌడీ మూకలు జనాలను భయపెడుతున్నా పోలీస్ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ బస్టాండ్ సమీపంలో దారి దోపిడీ చేసి యువకుడిని చంపిన ఘటనలో నిందితులను ఇంతవరకు పట్టుకోలేకపోయారు. సీసీ ఫుటేజీలో ముఖం క్లియర్‌గా కనిపిస్తున్నా కనీసం నిందితులను గుర్తించలేకపోవడం గమనార్హం. దీంతో పోలీస్ ఆఫీసర్లు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెరుగుతున్న నేరాలు
వరంగల్ కమిషనరేట్ లో ఏటికేడు నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి సంవత్సరం కమిషనరేట్ పరిధిలో సగటున 50 వరకు మర్డర్లు జరుగుతుండగా.. సుమారు 70 నుంచి 80 వరకు మర్డర్ అటెంప్ట్‌లు జరిగాయి. తమహిళలపై అఘాయిత్యాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. సగటున 11 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.
క్రైమ్‌ను కంట్రోల్ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్లు మొన్నటి వరకు ఎలక్షన్ల హడావుడిలో ఉండగా.. ఎలక్షన్ ముగిసినా కొన్నిచోట్ల పెట్రోలింగ్‌పై నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో జనాలకు ఇబ్బందులు ఎదురువుతన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా పోలీస్ఉన్నతాధికారులు క్రైమ్ కంట్రోల్‌పై దృష్టి పెట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. కత్తుల కల్చర్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లే కేంద్రాలుగా..
వరంగల్ నగరానికి రోడ్డు, రైలు మార్గాలతో ట్రాన్స్ ఫోర్ట్ ఫెసిలిటీ సౌకర్యం ఉండడంతో ఆంధ్రా, -ఒడిశా నుంచి పెద్దఎత్తున గంజాయి నగరానికి చేరుతోంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కూడా వెళుతోంది. అడపాదడపా పోలీసులు పట్టుకుంటున్నా సిటీలో కొన్ని ఏరియాల్లో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల బార్లు అర్ధరాత్రి వరకూ నడుపుతుండటం, మరికొన్ని చోట్ల బెల్టుషాపులు తెల్లవార్లూ తెరిచే ఉండడంతో యువకులు మత్తులో జోగుతూ నేరాలకు పాల్పడుతున్నారు.
కాగా మందుబాబులకు వరంగల్ సిటీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అడ్డాగా మారుతున్నాయి. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోని క్వార్టర్స్, రైల్వే పట్టాల వెంట ఉన్న కొన్ని ఏరియాలను గంజాయి గ్యాంగులు అడ్డాగా చేసుకుని దమ్ము లాగించేస్తున్నాయి. అనంతరం రోడ్ల మీదకు వచ్చి హల్చల్ చేస్తున్నాయి. ఆకతాయిలు దోపిడీలు, దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు.