- రోజుకోచోట బయటపడుతున్న ‘కల్తీ’ ఆనవాళ్లు
- డైలీ హైదరాబాద్ లోని
- స్వీట్ హౌస్‌లు, హోటళ్లకు
- వేల లీటర్ల సప్లై
- కెమికల్స్‌తో విచ్చలవిడిగా కృత్రిమ పాలు తయారీ
యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల దందా ఆగడం లేదు. కెమికల్స్ తో విచ్చలవిడిగా కృత్రిమ పాల తయారీ జరుగుతోంది. వీటిని అరికట్టడంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విఫలమవుతున్నారు. నోటీసులు ఇచ్చి, కేసులు నమోదు చేస్తున్నా శిక్షలు పడకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ శివారు జిల్లా కావడంతో యాదాద్రిని కృత్రిమ పాల తయారీకి అడ్డాగా మార్చేశారు. 17 మండలాల్లో 2.10 లక్షల ఇండ్లు ఉన్నాయి. దాదాపు 8 లక్షల జనాభా ఉంది. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు ఇక్కడి జనాభా, హోటళ్లకే సరిపోవడం లేదు. కానీ డైలీ జిల్లా నుంచి హైదరాబాద్‌కు వేల లీటర్ల పాలు సప్లై చేస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే పాలు చిక్కగా, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుండడంతో స్వీట్ హౌస్‌లు, హోటళ్ల నిర్వాహకుల నుంచి డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు కెమికల్స్ ఉపయోగించి పాలు తయారీ చేసి క్యాష్చేసుకుంటున్నారు.
బర్రె, ఆవు పాల పేరుతో..
భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మల రామారం, భువనగిరి, బీబీనగర్మండలాలతో పాటు మరికొన్ని చోట్ల పాలను కల్తీ చేయడమే గాక, కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. ఒక్క పాడి గేదె, ఆవు లేకుండానే పాల సేకరణ పేరుతో దందా కొనసాగిస్తున్నారు. లాభాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. వందల లీటర్ల పాలను వేల లీటర్లుగా మారుస్తున్నారు. సేకరించిన పాలలో నీళ్లు కలిపి, చిక్కదనం కోసం పౌడర్ కలుపుతున్నారు. మరికొందరు చుక్క పాలు లేకుండానే కెమికల్స్‌తో పాలు తయారు చేస్తున్నారు. నీటిలో మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రో క్లోరిక్ యాసిడ్, ఆక్సిటోసిన్ ఇంజక్షన్ బాటిల్, యూరియా, సర్చ్, బేకింగ్ సోడా, వంట నూనె కలిపి పాలను సృష్టిస్తున్నారు. అచ్చం పాలలాగే తెల్లగా, చిక్కగా, ఫ్యాట్ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు కూడా గుర్తించలేకపోతున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా ఈ పాలు విరిగిపోవు. డెడ్‌బాడీలను భద్రపరచడానికి వినియోగించే ఫార్మల్డిహైడ్ కెమికల్‌ను ఉపయోస్తున్నట్టు ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. చౌటుప్పల్మండలంలోని ప్రముఖ పాల ఉత్పత్తుల డెయిరీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. ఐదు రకాల ఉత్పత్తుల శాంపిళ్లను సేకరించి హైదరాబాద్నాచారంలోని ల్యాబ్‌కు పంపించారు. టోన్డ్ మిల్క్ప్యాకెట్లలో కల్తీ ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. సదరు కంపెనీకి అధికారులు నోటీసులు పంపించారు.
టెస్ట్ చేయడానికే నెలలు
ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎస్ఓటీ పోలీసులు ఇటీవల జిల్లాలోని పలుచోట్ల దాడులు నిర్వహించారు. కల్తీ పాలతోపాటు కృత్రిమ పాల తయారీ చేస్తున్న వారిని అరెస్ట్‌చేసి కేసులు నమోదు చేశారు. అయితే ల్యాబ్‌కు పంపిన పాల రిపోర్ట్ రావడానికే నెలల సమయం పడుతోంది. కేసులు నమోదు చేసినా కల్తీ దందా అని తేలడానికి ఏండ్ల టైమ్ పడుతోంది. పైగా ఫుడ్‌సేఫ్టీ డిపార్ట్మెంట్లోని ఖాళీలు కల్తీ వ్యాపారులకు కలిసొస్తున్నేది. ఒక జిల్లా ఆఫీసర్ మూడు జిల్లాల్లో పనిచేస్తున్నారు. యాదాద్రి జిల్లా ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ స్వాతి, సూర్యాపేటతోపాటు జనగామ జిల్లాకు ఇన్చార్జిగా ఉన్నారు. మూడు చోట్ల తనిఖీలు నిర్వహించడం సాధ్యం కావడం లేదు. ఏడాదిగా యాదాద్రి కలెక్టరేట్లో ఆఫీసు లేక పోవడంతో వేరే డిపార్ట్మెంట్ల ఆఫీసుల్లో కూర్చోవాల్సి వచ్చేది. ఇటీవల కలెక్టరేట్లో ఓ గది కేటాయించడం గమనార్హం.
చర్యలు తీసుకుంటున్నం
కొందరు వ్యాపారులు కృత్రిమంగా పాలు తయారు చేస్తున్నారు. కొందరు ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారు. ఫుడ్‌సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పాలల్లో నీళ్లు కలపడమే నేరం. ఈ వ్యాపారులు ఏకంగా కెమికల్స్ వాడుతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. కృత్రిమ పాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నం.
- స్వాతి, ఫుడ్ ఇన్స్పెక్టర్, యాదాద్రి జిల్లా
వరుస ఘటనలు
చౌటుప్పల్‌లోని ప్రముఖ మిల్క్ డెయిరీలో పాలు, పాల పదార్థాలకు సంబంధించి ఐదు రకాల శాంపిల్స్ ఇటీవల సేకరించారు. వాటిని టెస్ట్ చేయగా టోన్డ్మిల్క్లో కల్తీ ఆనవాళ్లు బయటపడ్డాయి.
బీబీనగర్ మండలం కొండమడుగులో ఓ ప్రైవేట్పాల సేకరణ సెంటర్ నడుస్తోంది. ఈ సెంటర్‌కు డైలీ రైతుల నుంచి 600 లీటర్లు వస్తుంటాయి. అయితే ఆ సెంటర్‌నుంచి వెళ్లే పాలలో శవాలను భద్రపరచడానికి ఉపయోగించే ‘ఫార్మల్ డిహైడ్’ను ఉపయోగిస్తున్నారని తేలింది. భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన కందాల బుచ్చిరెడ్డికి పాడి గేదెలు లేవు. అయితే ఇతను రైతుల వద్ద డైలీ 100 లీటర్ల పాలు సేకరిస్తున్నాడు. డిమాండును క్యాష్చేసుకునేందుకు కెమికల్స్వినియోగించి వంద లీటర్లను వందల లీటర్లుగా మార్చి హైదరాబాద్కోఠిలోని స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఎస్ఓటీ పోలీసుల దాడిలో బుచ్చిరెడ్డి సెంటర్లో100 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 కిలోల పాల పౌడర్, 110 లీటర్ల కృత్రిమ పాలు దొరికాయి.