- మట్టంపల్లి మండలంలో ఇప్పటికే 10 స్కూళ్లు క్లోజ్
- గురుకులాల్లో సీట్లకు పైసలు తీసుకుంటున్నరు
- కండ్ల కలత నివారణకు స్పెషల్ క్యాంపులేవి?
- జడ్పీ మీటింగ్‌లో విద్య, వైద్యాధికారులపై సభ్యుల మండిపాటు
సూర్యాపేట, వెలుగు : విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్లతో చేతులు కలిసి ప్రభుత్వ స్కూళ్లు ఉసురు తీస్తున్నారని జడ్పీ సభ్యులు ఆరోపించారు. మట్టంపల్లి మండలంలో దాదాపు 10 స్కూళ్లు మూతపడడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. ఆదివారం జడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపికా అధ్యక్షతన అడిషనల్ కలెక్టర్ ప్రయాంక చీఫ్ గెస్టుగా జిల్లా సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వాడీవేడీగా చర్చ జరిగింది. విద్య శాఖపై చర్చ సందర్భంగా సభ్యులు డీఈవో అశోక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్లు మూతపడుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటివరకు ఒక్క స్కూల్ ను కూడా విజిట్ చేయలేదని మండిపడ్డారు. మోతే మండలంలోని ఉర్లుగొండ జడ్పీ స్కూల్ హెచ్‌ఎం, టీచర్ వ్యవహారం అసభ్యకరంగా ఉందని ఆధారాలతో సహా సమర్పించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
కేవలం డిప్యుటేషన్ ఇచ్చి తిరిగి అదే స్కూళ్లో పోస్టింగ్ ఇచ్చారని, దీంతో విద్యార్థులు బైకాట్ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. డిప్యుటేషన్ పేర్లతో లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు గురుకులల్లో సీట్లను పైసలు తీసుకొని కేటాయిస్తున్నారని, దీంతో పేద విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తోందని వాపోయారు. మట్టంపల్లి మండలంలో నాన్ టీచింగ్ పోస్టులను ఎలా భర్తీ చేశారని ఆర్‌సీవో లక్ష్మయ్యను మట్టంపల్లి ఎంపీటీసీ సైదిరెడ్డి నిలదీయగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చెప్పిన ముగ్గురికి పోస్టులను ఇచ్చామని చెప్పడం గమనార్హం.
కండ్ల అద్దాలు ఇవ్వడం లేదు
కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్న చాలామందికి ఇప్పటి వరకు కండ్ల అద్దాలు ఇవ్వలేదని సభ్యులు మండిపడ్డారు. స్కూళ్లలో కండ్ల కలత కేసులు పెరుగుతున్నా స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏఎన్‌ఎంల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మెడిసిన్ అందించాలని కోరారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు క్యాన్సర్ ఉందని చెబుతున్నారే తప్ప రిపోర్టులు ఇవ్వడం లేదన్నారు. హుజూర్ నగర్ మండలంలో పల్లె దవాఖానాలకు శంకుస్థాపనలు చేసి నెలలు గడుస్తున్నా.. పనులు ప్రారంభించలేదన్నారు. అర్వపల్లి పీహెచ్‌సీలో 60 ఏండ్ల ఓల్డ్ బిల్డింగ్‌లో పాశు వైద్యశాల నడుస్తోందని, వర్షం వస్తే కులెందుకు సిద్ధంగా ఉందన వాపోయారు. ప్రభుత్వ స్థలం కేటాయించి కొత్త బిల్డింగ్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.
కాల్వకు గండ్లు పడుతున్నయ్
మట్టంపల్లి మండలంలో ఎనేస్పీ కాలువలకు గండ్లు పడి పొలాలు కొట్టుకపోతున్నాయని కాలువలను వెంటనే రిపేర్టుల చేపట్టాలని ఈ ప్రాంతం జడ్పీటీసీలు, ఎంపీపీలు కోరారు. శూన్య పహాడ్ వద్ద ఉన్న మూసి లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకపోవడంతో దాదాపు వెయ్యి ఎకరాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, ఎన్‌ఎస్పీ కెనాల్ ద్వారా 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతగిరి మండల కేంద్రంలో బస్ స్టాండ్ పక్కనే వైన్స్ షాప్ నిర్వహిస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని, దాన్ని మరోచోటుకు మార్చాలని కోరారు.
ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా కృషి చేయాలి
ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజా ప్రతినిధులకు తప్పనిసరిగా ఆహ్వానం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేసినందుకు అభినందన తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట నారాయణ, జడ్పీ సీఈవో సురేశ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్‌పై చర్చ కోసం పట్టు
మీటింగ్ ప్రారంభంలో కొందరు ప్రజాప్రతినిధులు ప్రొటోకాల్ పై చర్య జరపాలని పట్టుబట్టారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఫోన్ చేస్తే అధికారులు ఎత్తడం లేదని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకుంటే గ్రామాలలో ఎలా తిరగాలని అధికారులను ప్రశ్నించారు. లోకల్‌గా పని చేస్తున్న తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, గ్రామాల్లో చెత్త ఎత్తేందుకు మాత్రమే తాము గుర్తొస్తున్నామని మండిపడ్డారు. కాగా, మొత్తం 52శాఖలు ఉండగా 19శాఖల పైనే చర్చ జరిపారు. కీలకమైన గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ, సంక్షేమ శాఖలపై చర్చకు చేయకుండానే సమావేశం ముగిసినట్లు ప్రకటించారు.