సీఎంపై అనుచిత కామెంట్స్‌‌.. బీఆర్‌‌ఎస్‌‌ ఆఫీస్‌‌పై యూత్‌‌ కాంగ్రెస్‌‌ దాడి

యాదాద్రి, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు సీఎం రేవంత్‌‌రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహానికి గురైన యూత్‌‌ కాంగ్రెస్‌‌, ఎన్‌‌ఎస్‌‌యూఐ లీడర్లు బీఆర్‌‌ఎస్‌‌ ఆఫీస్‌‌పై దాడి చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బీఆర్‌‌ఎస్‌‌ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌రెడ్డి శనివారం స్థానిక పార్టీ ఆఫీస్‌‌లో ప్రెస్‌‌మీట్‌‌ పెట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌‌రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం యూత్‌‌ కాంగ్రెస్‌‌, ఎన్‌‌ఎస్‌‌యూఐ కార్యకర్తలకు తెలియడంతో వారు బీఆర్‌‌ఎస్‌‌ ఆఫీస్‌‌లోకి చొరబడి కుర్చీలు విరగొట్టి, ఫ్లెక్సీలు చించేశారు. కిటికీ అద్దాలు, టీవీని పగులగొట్టారు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌‌కు తరలించారు.

అనంతరం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌రెడ్డి రూరల్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో మోత్కూరు మండలం దత్తప్పగూడెంలోని బీఆర్‌‌ఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బీఆర్‌‌ఎస్‌‌ ఆఫీస్‌‌పై దాడిని ఆలేరు మాజీఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, భువనగిరి పార్లమెంట్‌‌ ఇన్‌‌చార్జి క్యామ మల్లేశ్​, సీపీఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌‌ ఖండించారు. 

రేవంత్‌‌రెడ్డి ఆదేశాలతోనే దాడి: కేటీఆర్‌‌
సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశాలతోనే కాంగ్రెస్‌‌ లీడర్లు దాడులు చేస్తున్నారని కేటీఆర్‌‌ ఆరోపించారు. కంచర్ల రామకృష్ణా రెడ్డి, పైళ్ల శేఖర్‌‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే పార్టీ ఆఫీస్‌‌పై దాడి చేశారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌‌ఎస్‌‌ ఆఫీసులకే రక్షణ లేకపోతే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. తమ పార్టీ ఆఫీస్‌‌లు, కార్యకర్తల జోలికొస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పదేండ్లపాటు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు అరాచకాలకు చిరునామాగా మారిందన్నారు.