నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ కమలానెహ్రు ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, డీఎంహెచ్ఓ ఏకే రావు, డీసీహెచ్ఎస్ మాతృనాయక్ పాల్గొన్నారు. అన్ని వసతులతో పాటు, సిబ్బందిని సమకూర్చిన తర్వాతే డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. విధుల పట్ల డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యమైన వైద్యం అందేలా చూస్తామన్నారు.
ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తెలంగాణలో చాలా పథకాలు ప్రవేశపెడుతున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. వైద్యం విషయంలోనూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. డయాలసిస్ పేషెంట్లకు ఓ వైపు పెన్షన్ ఇస్తూ.. మరోవైపు వారు గ్రామాల నుంచి డయాలసిస్ కేంద్రాలకు వెళ్లడానికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సేవలను డయాలసిస్ పేషెంట్లు వినియోగించుకోవాలని కోరారు.