భక్తుల కొంగు బంగారమైన ఐనవోలు మల్లన్న జాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంలతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జాతర ఉగాది వరకు కొనసాగనుంది. వరంగల్ నుంచి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జాతరలో 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 100 సీసీ కెమరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షణ జరుగుతోంది.
వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఐనవోలులో కండేలరాయుడు, మైలార దేవుడిగా భక్తులతో మల్లన్న స్వామి పూజలు అందుకుంటున్నాడు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం, ఖడ్గం, నెత్తిన కిరీటం, కోరమీసాలతో అభయమిస్తూ స్వామి దర్శనమిస్తారు. లింగస్వరూపంలో మూలవిరాట్ అర్ధప్రాణవట్టం గోధుమ రంగులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత అని చెప్పాలి. ఇక్కడ భక్తులు కిలోల కొద్ది పసుపును స్వామి వారికి సమర్పిస్తారు. దానినే బొట్టుగా ధరిస్తారు.