
హనుమకొండ, ఐనవోలు, వెలుగు: ప్రాచీన శైవక్షేత్రం ఐలోని మల్లన్న సన్నిధి సందడిగా మారింది. ఒగ్గు పూజారుల పసుపు బండారి పట్నాలు, శివసత్తుల పూనకాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరాగా.. ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అర్చకులు ధ్వజారోహణతో అంకురార్పణ చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలతో ఆశీర్వచనాలు అందజేశారు. పాలకవర్గంపై హైకోర్టు స్టే ఉండడంతో ఈవో అద్దంకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం వరకు భక్తులు పెద్ద మొత్తంలో తరలిరాగా.. సంక్రాంతి సందర్భంగా శనివారం నుంచి దాదాపు 10 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు
జాతర మొదటిరోజు వివిధ పార్టీలకు చెందిన నేతలు స్వామి వారిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తీన్మార్ మల్లన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ భక్తి పేరుతో ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టే నాయకుల్లో మార్పురావాలని స్వామికి మొక్కుకున్నట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలగాలని వేడుకున్నట్లు చెప్పారు.
ఐనవోలుకు బల్దియా సిబ్బంది
ఐనవోలు జాతరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 126 మంది శానిటేషన్ సిబ్బంది డ్యూటీ చేయనున్నట్లు బల్దియా కమిషనర్ ప్రావీణ్య పేర్కొన్నారు. శుక్రవారం సిబ్బంది స్వీపింగ్మిషన్లు, ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోలతో బయలుదేరి వెళ్లారు. పంపించినట్లు చెప్పారు.