చెన్నై అతలాకుతలం వీడని వర్షం.. వీధుల్లో వరద

చెన్నై అతలాకుతలం వీడని వర్షం.. వీధుల్లో వరద
  • నాలుగో అంతస్తులోకి బైకులు
  • రికార్డు వర్షపాతంతో నిండుకుండల్లా డ్యాములు
  • బెంగళూరులో జనజీవనం అస్తవ్యస్తం.. ఏపీలోనూ వానలు

చెన్నై, బెంగళూరు:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దక్షిణాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడుతో పాటు ఏపీ, కర్నాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. తిరువళ్లూరు, కాంచీపురం, మధురై సహా పలు ప్రాంతాల్లో వీధులను వరద ముంచెత్తింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరడంతో పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలకూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం సాయంత్రం సమయానికి చెన్నైకి ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో ఉందని ఐఎండీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు, పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఇరు రాష్ట్రాలను ముంచెత్తుతాయని హెచ్చరించింది. చెన్నై సిటీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది.

నాలుగో అంతస్తులోకి వాహనాలు..

గతేడాది వర్షాలు వరదలకు నీట మునిగిన వాహనాల రిపేరు ఖర్చులు తడిసిమోపెడవ్వడంతో ఈసారి వాహనదారులు అలర్టయ్యారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో వాహనాలను వరదలు రాని ప్రాంతాల్లో, ఫ్లైఓవర్ల పైన పార్క్ చేస్తున్నారు. ద్విచక్రవాహనాలను అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తులోకి తీసుకెళ్లి వరండాలో, హాలులో పెట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. గతేడాది అయిన రిపేర్ ఖర్చులు గుర్తుచేసుకుంటే భయమేస్తోందని, ఆ పరిస్థితి మళ్లీ ఎదురవకూడదనే జాగ్రత్త పడుతున్నామని వాహనదారులు చెబుతున్నారు.

డ్రోన్లతో నిత్యావసర వస్తువుల సప్లై..

చెన్నైలో నీట మునిగిన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు అధికారులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు సాయం అందిస్తున్నారు. నిత్యావసర వస్తువులను డ్రోన్ల ద్వారా చేరవేస్తున్నారు. డ్రోన్ స్టార్టప్ కంపెనీ ‘గరుడ ఏరోస్పేస్’ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో వరద బాధితులకు ఆహార పొట్లాలు, మందులు, మంచినీళ్లు ఇతరత్రా నిత్యావసర వస్తువులను డ్రోన్ల ద్వారా అందిస్తోంది. 

నిండుకుండల్లా డ్యామ్ లు..

బుధవారం ఉదయం 8:30 సమయానికి.. గడిచిన 24 గంటల్లో చెన్నైలోని పలు ఏరియాల్లో రికార్డు వర్షపాతం నమోదైందని ఐఎండీ ప్రాంతీయ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముంచెత్తుతున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు డ్యాములు నిండుకుండల్లా మారుతున్నాయి.

బెంగళూరులో జనజీవనం అస్తవ్యస్తం..

కర్నాటక రాజధాని బెంగళూరులో వర్షం ఎడతెగకుండా కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నగరంలోని వివిధ ఏరియాల్లో సుమారు 150 ఇళ్లు నీట మునిగాయని అధికారులు తెలిపారు. గురువారం కూడా వర్షం ముంచెత్తుతుందంటూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

 బుధవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో ఒక్క బెంగళూరులోనే 66.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని తెలిపింది. వర్షాలకు ట్రాకులు నీట మునగడంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను మోహరించి ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు వేగంగా పనులు చేయిస్తోంది.