హిమాచల్​ప్రదేశ్​లో కుండపోత.. కులు, మండి జిల్లాల్లో ఎడతెగని వర్షాలు

సిమ్లా/మండి: హిమాచల్​ప్రదేశ్​లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోలన్, హమీర్​పూర్, సిమ్లా, కాంగ్రా, సిరిమౌర్, మండి, కులు జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. మండి, కులు జిల్లాలను కలిపే నేషనల్ హైవేపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనికితోడు వర్షాలకు రోడ్డు మొత్తం దెబ్బతిన్నది. మండి జిల్లా బాగిపుల్ ఏరియాలోని ప్రశార్ సరస్సు దగ్గర వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 500పైగా వెహికల్స్ నిలిచిపోయాయి. దీంతో 15 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 200 మందికి పైగా టూరిస్టులు శనివారం రాత్రి నుంచి రోడ్డుపైనే గడుపుతున్నారు. చుట్టుపక్కల ఉన్న హోటళ్లలోని గదులన్నీ నిండిపోవడంతో తమ పిల్లలతో కార్లలోనే కూర్చుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 70 కిలో మీటర్ల మండి – పండో – కులు రోడ్డంతా వరదలకు దెబ్బతిన్నది. మొత్తం 301 రోడ్లను పోలీసులు క్లోజ్ చేశారు.

రాజస్థాన్​లో ఉరుములు, మెరుపులతో వానలు

రాజస్థాన్​లో పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు. మరికొంత మంది గాయపడ్డారు. పాలి జిల్లాలో దినేశ్(21), బరన్​లో హరిరాం (46), కమల్ (32), చిత్తోర్​గఢ్​లో పదేండ్ల అమ్మాయి పిడుగుపాటుకు మృతి చెందారు. నింబహెడాలో పిడుగుపాటుకు నలుగురు గాయపడ్డారు. ఉదయ్​పూర్, కోట, బికనీర్, జైపూర్ డివిజన్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా, జమ్మూ కాశ్మీర్​లోని రాంబన్ సిటీ వద్ద ఉన్న కెఫెటేరియా మోర్, మెహర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ శ్రీనగర్ హైవేను పోలీసులు బ్లాక్ చేశారు.

మధ్యప్రదేశ్​కు ఆరెంజ్ అలర్ట్

మధ్యప్రదేశ్​కు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ.. మంగళవారం ఉదయం నాటికి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వెస్ట్ మధ్యప్రదేశ్​లో ఉరుములు, మెరుపులతో వాన పడే చాన్స్ ఉందని వివరించింది. సాగర్, నార్సింగ్​పూర్, బేతుల్, మండ్లా, సియోని, చింద్వారా, జబల్​పూర్​లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాలు ఇప్పటి వరకు ఇండియాలో 80 శాతం వ్యాపించాయని ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నరేశ్ కుమార్ తెలిపారు.

ముంబైలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు

ముంబై సహా మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 24 గంటలుగా ముంబైతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈస్టర్న్, వెస్టర్న్ సిటీలో సగటున 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జార్ఖండ్​లో మోస్తరు వానలు పడ్తున్నాయి. వర్షాల లోటు 64 శాతానికి తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

ALSO READ:సివర్ జెట్టింగ్ మెషీన్ల లేమి.. ఇంకా కార్మికులతోనే మ్యాన్​హోల్స్​ క్లీనింగ్ 

చండీగఢ్‑మనాలి  నేషనల్ హైవే బ్లాక్

మండిలోని 7 మైల్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్ – మనాలి నేషనల్ హైవే బ్లాక్ అయింది. దీంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, బండ రాళ్లను తొలగించేందుకు పేలుడు పదార్థాలు వాడుతున్నామని మండి అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయానికి వన్ వే క్లియర్ అవుతుందన్నారు. క్లోజ్ చేసిన 301 రోడ్లలో 180 రోడ్లను సోమవారం రాత్రికి ఓపెన్ చేస్తామని పీడబ్ల్యూడీ మినిస్టర్ విక్రమాదిత్య సింగ్ తెలిపారు. మరో 15 రోడ్లు మంగళవారం నాటికి, మిగిలినవి జూన్ 30 నాటికి తెరుస్తామని, అది కూడా వెదర్ కండిషన్​పై ఆధారపడి ఉంటుందన్నారు. హిమాచల్ వ్యాప్తంగా ఆరుగురు చనిపోగా, 10 మంది గాయపడ్డారు. 11ఇండ్లు కూలిపోయాయి.