అకాల వర్షం.. రైతులు ఆగం

రెక్కల కష్టం నీటిపాలవుతుంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంటను చూసుకొని ముసిరిపోయిన రైతును.. వడగాళ్ల వాన కోలుకోలేని దెబ్బ తీసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. అకాల వర్షంతో విక్రయించేందుకు సిద్దంగా ఉన్న ధాన్యం తడిసిపోయింది.  పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిముద్దయింది. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఆరపోసిన ధాన్యం వర్షార్పణం అవ్వటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కోలుకోలేని దెబ్బ..

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షం  తమను కోలుకోలేని దెబ్బ తీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతలు మొదలు పెట్టినప్పటి నుండి వర్షాలు వెంటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తీరా పంట చేతికి వచ్చి కొనుగోళ్లు జరుగుతున్న సమయంలో వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని రైతులు బాధపడుతున్నారు. చేతికి వచ్చిన పంట కళ్ళముందే తడిసి పోతుంటే ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నామని అన్నదాతలు కన్నీరు పెట్టకుంటున్నారు. అకాల వర్షాలతో ీతీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.