- నిండు కుండల్లా చెరువులు, కుంటలు
- పొంగిపొర్లిన వాగులు
- ఉమ్మడి జిల్లాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం
హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనాలను డైవర్ట్ చేశారు. జడ్చర్ల మండలం అల్వాన్‌పల్లి, -తంగెళ్లపల్లి గ్రామాల మధ్య దుందుభి వాగుపై ఉన్న రోడ్డు కోతకు గురైంది. కోయిల్‌కొండ మండలం గుండేట్ వాగు, దమాయపల్లి వాగు పొంగడం, నేరేడుగాం బ్రిడ్జిపై నుంచి వరద పారడం, నర్వ మండలం రాయికోడ్ చెరువు అలుగు పారడంతో రాకపోకలు నిలిచాయి. రాష్ట్ర సరిహద్దులోని ఊట్కూరు మండలం సమస్తాపూర్ చిన్న వాగు బ్రిడ్జిపై వరద నీరు పోతుండడంతో రాకపోకలు తిప్పలు పడాల్సి వచ్చింది. పెద్ద జట్రం పెద్దవాగు అలుగు పారడంతో నారాయణపేటకు వెళ్లే వారిని గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వాగు దాటించారు.
కోయిల్‌కొండ మండలం దామాయపల్లిలోని గణపలిరాయుడు చెరువు కట్ట లీకవుతోంది. మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామ శివారులో మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీం కెనాల్ తెగిపోయింది. నవాబ్‌పేట మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కల్వర్టుకు గండి పడింది. నర్వ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామంలోని పెరుమొల్ల చెరువు కట్టపై పగుళ్లు ఏర్పడ్డాయి. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మణికొండ అటవీ ప్రాంతంలో ఊటకుంట చెరువు కట్ట తెగిపోయింది. తంగేళ్లపల్లి--అల్వాన్ పల్లి గ్రామా మధ్య దుందుభి వాగు ఉన్న రోడ్డు తెగిపోయింది.
జడ్చర్లలో ఊరకుంట అలుగు పారడంతో పద్మావతి కాలనీ జలమయమైంది. పోచమ్మ గుడి నీటిలో మునిగిపోయింది. సిగ్నల్ గడ్డ నుంచి నేతాజీ చౌరస్తా వరకు ప్రధాన రోడ్డు జలమయమైంది. రాజీవ్ నగర్, శివాజీ నగర్, ఎస్పీవీ నగర్, శాంతి నగర్, పాత బజార్‌లోని పలువురి ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. కోస్గిలోని బృందావన్ కాలనీలోకి, కోయిల్‌కొండ మండలం ఇగ్రహీంనగర్ గ్రామాల్లోకి లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మహబూబ్ నగర్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలోకి వరద నీరు చేరింది. మిడ్జిల్ కేజీబీవీ, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ ప్రభుత్వ పాఠశాలోకి, విద్యుత్ సబ్ స్టేషన్లోకి వరద నీరు చేరింది.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు, అమరవాయి గ్రామాల మధ్య వాగుతో పాటు ఉండవెల్లి మండలం కలుగొట్ల మెన్నిపాడు గ్రామాల మధ్య వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజోలి డ్యాం దగ్గర్లోని మట్టికట్ట కోతకి గురైంది. జమ్మిచేడు జమ్మలమ్మ ఆలయం దగ్గర పురాతనమైన తాయమ్మ రవి చెట్టు విరిగిపడింది. ఎర్రవల్లి మండల కేంద్రంలోని బీచుపల్లి పుష్కర ఘాట్ వద్ద కృష్ణ నీటి ఉధృతిని, షేక్ పల్లెవాగు పరిసర ప్రాంతాలను కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో లోతట్టుప్రాంతాలైన వీరబ్రహ్మంగారి వీధీ, ఎంసీహెచ్ ఆసుపత్రి, వెంగళరావునగర్ కాలనీల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. వనపర్తి, -మదనాపూరు, -ఆత్మకూరు ప్రధాన రహదారి బ్రిడ్జిపై వరద నీరు నిలవడంతో రాకపోకలు నిలిపివేశారు.
మదనాపూరు మండలం సరళాసాగర్ ప్రాజెక్టు నిండడంతో ఆటోమేటిక్ సైఫన్లు తెరచుకుని వరద నీరు కిందికి పారుతోంది. రామన్‌పాడు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తారు.
వీపనగండ్ల మండలం -కల్వరాల గ్రామ సమీపంలోని భీమా కాల్వ తెగిపోయింది. 80 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గోవర్ధనగిరి, -వీపనగండ్ల గ్రామాల మధ్య కల్వర్టుపై వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు ఆపేశారు. పెద్దమందడి మండలం జంగమాయపల్లి,-అంకూరు గ్రామాల మధ్య వరద ఉధృతితో రోడ్‌ను ఆఫీసర్లు క్లోజ్ చేశారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. మున్ననూర్ ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద శ్రీశైలం వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు.
గొర్రెలు మేపేందుకు వెళ్లి తాడూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన ఆంజనేయులు, చిన్నమల్లయ్యు దుందుభి వాగులో చిక్కుకుపోయారు. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సోమశిల నుంచి బోట్లు, మత్స్యకారులను రప్పించి ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
బిజినేపల్లి మండలం లట్టుపల్లి వద్ద కేఎల్ఐ మెయిన్ కెనాల్‌కు గండి పడి 300 ఎకరాల వరి పంట నీట మునిగింది. కోడేరు, ఉప్పునుంతల, బిజినేపల్లి మండలాల్లో వరి పొలాలు నీట మునిగాయి. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన వెంకటస్వామి నాగనూల్ చెరువు కల్వర్ట్‌పై వెళ్తూ వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా, అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్తఖీఖాన్, కానిస్టేబుల్ రాము రక్షించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇండ్లు కూలిపోగా, నిరాశ్రయులకు అధికారులు ఆశ్రయం కల్పించారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లో వాగుల ఉధృతి దృష్ట్యా పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. వాగులకు అడ్డంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. కాలనీలు, రోడ్లపైకి వరద చేరడంతో ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. పాత ఇండ్లు, మిద్దెలు కూలడంతో నిరాశ్రయులయ్యారు. నిన్న మొన్నటి వరకు నీళ్లు లేక వెలవెలబోయిన చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి అలుగు పోస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహించడంతో ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
వెలుగు, నెట్ వర్క్