- నిజామాబాద్ అంతటా వర్షం
నిజామాబాద్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. తెరిపిలేని వర్షంతో ప్రజలు ఇండ్లు విడిచి బయటకు రాలేదు. నగరంలో లోతట్టు కాలనీల్లో వర్షం నీరు చెరువులను తలపిస్తోంది. జిల్లాలో ధర్పల్లిలో అధికంగా 169.1 మిల్లి మీటర్ల వర్షం కురియగా.. వర్నిలో 125.9, చందూరు లో 105,3 సిరికొండలో 102.5 కిలోమీటర్ల భారీ వర్షం కురిసింది. నగరంలోని నాలకల్ రోడ్, రైల్వే స్టేషన్, కోర్టు చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, దుబ్బ బైపాస్ లో రోడ్డు పై వర్షం నీరు నిలిచింది. ల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పలు చెరువులు నిండి అలుగు పారుతున్నాయి.
అధిక వర్షం కురిసిన ధర్పల్లి, వర్ని, చందూర్, సిరికొండ, మోస్రా, వేల్పూర్, భీంగల్, ముగ్పాల్, కమ్మర్పల్లి, నవీపేట, ఇందల్వాయి మండలంలోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. నగరంలో మారుతీనగర్, గంగాస్థాన్ ఫేజ్1,2, చంద్రశేఖర్‌కాలనీ, గౌతంనగర్, ఆదర్శనగర్, దుబ్బ, మాలపల్లి, అర్సాపల్లి, మంగమ్మ కాలనీ, ఆటోనగర్, వినాయక్‌నగర్, యెండల టవర్స్, బస్వాగార్డెన్, వీక్లీ మార్కెట్ ఏరియా వరద నీటితో నిండిపోయాయి. బోధన్ టౌన్లో.. వెంకటేశ్వరకాలనీ, గౌడ్స్ కాలనీ, శ్రీనివాస థియేటర్ బ్యాక్ ఏరియా, రాకాసీపేట ఆర్మూర్ టౌన్, భీంగల్ టౌన్ లో కొన్ని కాలనీలు నీట మునిగాయి. ఇందల్వాయి-ధర్పల్లి మెయిన్ రోడ్‌ను క్లోజ్ అయింది. ఇందల్వాయి-, సిర్నాపల్లి వంతెన మీదుగా నీరు పారుతున్నందున రోడ్ మూసేశారు.
కంట్రోల్ రూం విజిట్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఫోన్ ద్వారా తెలుసుకోడానికి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం విజిట్ చేశారు. పౌరులు 08462-220183 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. నిజామాబాద్, వెలుగు
కామారెడ్డిలో ప్రాజెక్టులు, చెరువులకు జలకళ
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో వాగులు పొంగి ప్రవహించాయి. ప్రాజెక్టులు చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరింది. చెరువులు అలుగు పారుతున్నాయి. రోడ్లపై నుంచి వరద నీరు పొంగి ప్రవహించటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి సమీపంలో టెకిర్యాల్ వద్ద హైవేపై కల్వర్టు కుంగిపోవటంతో వెహికల్స్ రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో 24 గంటల్లో పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భిక్కనూరు మండలంలలో అత్యధికంగా 19.4 సెం.మీ. రికార్డు అయ్యింది. సదాశివనగర్‌లో 18.9 సెం.మీ., బాన్సువాడలో 18.5 సెం.మీ., కామారెడ్డిలో 17.4 సెం.మీ.,తాడ్వాయిలో 15.6 సెం.మీ., దోమకొండలో 15 సెం.మీ., నస్రుల్లాబాద్‌లో 13.4 సెం.మీ., రాజంపేటలో 13.1 సెం.మీ., పాల్వంచలో 10.6 సెం.మీ., లింగంపేటలో 9.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. పాత ఇండ్లలో ఉన్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
4 లింగంపేట మండలం అయిలాపూర్- రాంపూర్ మధ్య, లింగంపేట- అయిలాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
4 తాడ్వాయి మండలంలో కాలోజీవాడి వాగు ప్రవహించటంతో కాలోజీవాడి, సంగోజివాడి మధ్య రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.
4 సదాశివనగర్ మండలం అమర్లబండ వాగు ప్రవహించటంతో వెహికల్స్ రాకపోకలకు అంతరాయం కలిగింది. కామారెడ్డి మండలం అడ్లూర్, ఇస్రోజివాడి సమీపంలోని కాజ్ వే పై నుంచి నీరు వెళ్లడంతో రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి, మోషంపూర్, పొసానిపేట, రంగంపేటలకు రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
4 బీబీపేట మండలం మహ్మదాపూర్ సమీపంలో ఎడ్లకట్ట వాగు రోడ్డుపై నీరు ప్రవహించటంతో మహమ్మదాపూర్-జనగామ మర్రి మధ్య రాకపోలకు అంతరాయం కలిగింది.
4 పాల్వంచ మండలం ఫరీద్‌పేట సమీపంలో రాకపోకలకు అంతరాయం కలిగింది.