అమ్మతోడు నిజం : కిలో ఉల్లి మూడు రూపాయలు

అమ్మతోడు నిజం : కిలో ఉల్లి మూడు రూపాయలు

కిలో ఉల్లి ఎంత అనుకుంటున్నారు.. ఓ 20, 30 రూపాయలు.. అవును.. మీ ఇంటి దగ్గర కిరాణా కొట్లో ఇదే రేటు ఉంది. అదే హోల్ సేల్ దగ్గర అయితే వంద రూపాయలకు ఆరు కిలోలు ఇస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నా కిలో 15 రూపాయల ధర ఉంది. వాస్తవంగా కిలో ఉల్లి మూడు రూపాయలకే దొరుకుతుంది.. అది మనకు కాదు.. రైతులు అమ్మే మార్కెట్ యార్డులో. ఓ వైపు టమాటా ధర కిలో 100 రూపాయలకు చేరుకున్న సమయంలో.. ఉల్లి ధర చర్చనీయాంశం అయ్యింది.

మహారాష్ట్ర నాసిక్ కేంద్రంగా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ అనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఆ మార్కెట్ కు రోజుకు 80 లారీల ఉల్లిపాయలు వస్తున్నాయి. సూపర్ క్వాలిటీ ధర కిలో 12 నుంచి 15 రూపాయలు పలుకుతుండగా.. మీడియం ఉల్లి గడ్డల ధర 5 నుంచి ఎనిమిది రూపాయలుగా రైతులకు చెల్లిస్తున్నారు వ్యాపారులు.

ఇక ఎక్కువగా పాడైపోయిన ఉల్లిని ఒక్క రూపాయి నుంచి మూడు రూపాయలగా చెల్లిస్తున్నారు. రెగ్యులర్ గా.. మన దగ్గర దొరికే ఉల్లి రకం అయితే.. కిలో మూడు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు వ్యాపారులు. మార్కెట్ కు ఉల్లిపాయల రాక ఎక్కువగా ఉండటంతో.. ఒక్కసారి ధర పడిపోయింది అంటున్నారు వ్యాపారులు.

ALSO READ:క్లాసులో.. పాఠాలు వింటూనే గుండెపోటుతో స్టూడెంట్ మృతి

ప్రస్తుతం రాబోయే నెల రోజులకు సరిపడా ఉల్లి.. మార్కెట్ లోఉందని.. అందుకే ధర పలకటం లేదనేది వ్యాపారులు చెబుతున్న మాట. ఓ వైపు టమాటా ధర ఆకాశానికి వెళ్లిన క్రమంలో.. ఉల్లి ధర పాతాళానికి పడిపోవటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి రైతులకు ఆదుకోవాలని నాసిక మార్కెట్ యార్డు దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.