హైదరాబాద్, వెలుగు: ఏపీలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడ, గుంటూరు నగరాలు వరద నీటితో అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలకు విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందారు. మృతులను మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Also Read:-హైదరాబాద్ లో కుండపోత
కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న ఇండ్ల శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనేది తెలుసుకునేందుకు గాలిస్తున్నారు. రాళ్లు జారిపడిన ఘటనలో ఇండ్రకీలాద్రి కొండపైన ఉన్న ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆఫీసు పూర్తిగా ధ్వంసం అయింది. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏపీ హోంమంత్రి అనిత స్పాట్కుచేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు.